Yamuna River: డేంజర్ మార్కును దాటేసిన యమున.. ముప్పు ముంగిట్లో ఢిల్లీ

  • ఈ ఉదయం పది గంటలకు 205.75 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం
  • ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు
  •  హత్నికుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటీ విడుదల
  • ఢిల్లీలో ఇంకా నీటిముప్పులోనే పలు ప్రాంతాలు
Yamuna water level breaches danger mark again

యమునా నది మరోమారు  డేంజర్ మార్కును దాటేసింది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఉదయం ఏడు గంటలకు 205. 81 మీటర్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని యమునలోకి విడిచిపెడుతున్నారు. దీంతో నది నీటిమట్టం క్షణక్షణానికి పెరుగుతోంది. ఈ ఉదయం పది గంటలకు 206.01 మీటర్లకు చేరుకుంది. సాయంత్రానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. హత్నికుండ్ నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేస్తుండడంతో యమున మహోగ్రరూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం హై అలెర్ట్ జారీ చేసింది.  

మరోవైపు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. హిందాన్ నది నీటి మట్టం పెరగడంతో ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పలు ఇళ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు గత వారం రోజులుగా ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఈ నెల 13న 208.66 మీటర్లకు చేరుకున్న యమునా నది నీటిమట్టం 1978 సెప్టెంబరులో నమోదైన 207.49 మీటర్ల రికార్డును తుడిచిపెట్టేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 27 వేల మందికిపైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

  • Loading...

More Telugu News