Gorilla: తస్సదియ్యా.. మగ గొరిల్లా అనుకుంటే పిల్లకు జన్మనిచ్చింది!

  • ఒహియోలోని కొలంబస్ జూలో ఘటన
  • నాలుగేళ్లుగా మగ గొరిల్లాగా భావిస్తూ వచ్చిన జూ అధికారులు
  • 8 ఏళ్ల వయసు వచ్చే వరకు గొరిల్లా ఆడదా.. మగదా గుర్తించలేమని వివరణ
  • ఇప్పుడు పుట్టింది మాత్రం ఆడదేనన్న అధికారులు
Gorilla Thought To Be Male Gives Birth To A Baby Girl

అమెరికాలోని ఓ జూలో ఉన్న మగ గొరిల్లా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒహియోలోని కొలంబస్ జూలో ఉన్న సల్లీ అనే గొరిల్లా తాజాగా ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చింది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాకపోతే అది మగ గొరిల్లా కావడమే ఇక్కడ అందరి సంభ్రమాశ్చర్యాలకు కారణం. జూ అధికారులు దానిని నాలుగేళ్లుగా మగ గొరిల్లాగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడది మరో పిల్లకు జన్మనివ్వడంతో అది ఆడదేనని నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని వారు ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు. 

విషయం తెలిసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఏళ్ల తరబడి ఎలా పొరపాటు చేస్తారని, ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పందించిన జూ అధికారులు వివరణ ఇచ్చారు. గొరిల్లాలు 8 ఏళ్ల వచ్చేవరకు ఆడ, మగ ఒకలానే ఉంటాయని, అందుకనే గుర్తించడం కష్టమైందని పేర్కొన్నారు. వాటికి ఒక వయసు వచ్చిన తర్వాతే అవి ఆడవా? మగవా? అన్నవి తెలుస్తుందని, 12 ఏళ్ల తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని వివరించారు. 

సల్లీ పిల్లగా ఉన్నప్పుడు ఈ జూకు తీసుకొచ్చామని, కాబట్టి అప్పట్లో అది ఆడదా, మగదా అన్న విషయాన్ని నిర్ధారించలేదని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పుడు పుట్టింది మాత్రం ఆడగొరిల్లానే అని స్పష్టం చేశారు. సల్లీ తన పిల్లను ఎంతో ప్రేమగా చూసుకుంటోందని పేర్కొన్నారు. వాటి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News