YS Sharmila: 54 లక్షలమందికి కేసీఆర్ సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల

  • ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
  • ఇంటికో ఉద్యోగమని గద్దెనెక్కి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని విమర్శ
  • 1.30 లక్షల పోస్టులు భర్తీ చేసినట్లు ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని ఆరోపణ
  • పేపర్ లీకేజీలతోనే కేసీఆర్ విశ్వసనీయత వెలుగులోకి వచ్చిందని ఎద్దేవా
YS Sharmila demands for white paper on employement

ఉద్యోగాల కల్పనపై దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఉద్యోగాల పేరుతో గడిచిన తొమ్మిదేళ్లలో కాలయాపన చేసిన కేసీఆర్ ఈ సవాల్ స్వీకరించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 

ఇంటికో ఉద్యోగమని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష పోస్టులు భర్తీ చేస్తామని, ఆ తర్వాత 80 వేల పోస్టులు భర్తీ చేస్తామని మరోసారి మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో భర్తీ చేసిన పోస్టులు కేవలం 58,240 మాత్రమేనని షర్మిల ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 1.30 లక్షల పోస్టులు భర్తీ చేసినట్లుగా చెబుతోందని, కానీ అది అవాస్తవమని షర్మిల అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వని ఘనత కేసీఆర్ దే అని ఎద్దేవా చేశారు. 

నోటిఫికేషన్లు ఇవ్వడం తప్ప ఒక్కరికీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చింది లేదన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమన్నారు. తెలంగాణలో పేపర్ లీకేజీలతోనే కేసీఆర్ విశ్వసనీయత వెలుగులోకి వచ్చిందని మండిపడ్డారు.

తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిస్వాల్ కమిటీ చెప్పిందని, కానీ ఆ కమిటీ రిపోర్ట్ ను తుంగలో తొక్కి, ఖాళీల వివరాలను కప్పిపెట్టారని ఆరోపించారు. అసలు, అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 20 వేల ఉద్యోగాలు ఇచ్చినా ఈ పాటికి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. 

పరిపాలన చేతకాని బీఆర్ఎస్, ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగులను బలి తీసుకుంటోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.3,016 నిరుద్యోగ భృతి ఏమయిందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News