Qin Gang: నెల రోజులుగా ఆచూకీ లేని చైనా విదేశాంగ మంత్రి... అఫైరే కారణమా?

  • చైనా విదేశీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్న క్విన్ గాంగ్
  • ఓ మహిళా జర్నలిస్టుతో అఫైర్ అంటూ ఊహాగానాలు
  • జూన్ 25 తర్వాత బహిరంగంగా కనిపించని క్విన్ గాంగ్
  • చైనాలో ఇలాంటివి మామూలేనన్న పాశ్చాత్య మీడియా!
China foreign minister Qin Gang not appeared in public for one month

అధ్యక్షుడు షి జిన్ పింగ్ కు అత్యంత నమ్మకస్తుడు, విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. ఆయన ఎక్కడున్నారన్నది మీడియాకు కూడా అంతుబట్టడంలేదు. ఓ పాత్రికేయురాలితో క్విన్ గాంగ్ కు అఫైర్ ఉందన్న నేపథ్యంలో, ఆయన అదృశ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

గత నెల 25న రష్యా, శ్రీలంక, వియత్నాంకు చెందిన కొందరు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ బహిరంగంగా కనిపించడం అదే చివరిసారి. క్విన్ గాంగ్ వయసు 57 సంవత్సరాలు. చైనా రాజకీయాల్లో బలమైన నేతగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఆచూకీ లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 

ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియాన్ సదస్సులో పాల్గొన్న చైనా బృందానికి వాస్తవానికి క్విన్ గాంగ్ నాయకత్వం వహించాల్సి ఉన్నా, ఆయన అదృశ్యం కావడంతో మరొకరికి ఆ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వివరణ ఇచ్చారు. క్విన్ గాంగ్ ఆరోగ్య కారణాల రీత్యా ఇండోనేషియా వెళ్లలేకపోయారని చెప్పారే తప్ప, అంతకుమించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. 

అటు, యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ చీఫ్ జోసెప్ బారెల్ తో సమావేశం కూడా వెనక్కి వెళ్లింది. ఈ సమావేశం ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొన్న చైనా, అంతకుమించి వివరణ ఇవ్వలేదు.

 కాగా, చైనా దేశీయ సెర్చ్ ఇంజిన్ బైడూలో క్విన్ గాంగ్ గురించి వెదకడం విపరీతంగా పెరిగిపోయిందట. రోజుకు 3.80 లక్షల మంది ఆయన గురించి నెట్ లో సెర్చ్ చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ మహిళా జర్నలిస్టు ఫు జావోషియాన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అదృశ్యానికి ఈ అఫైరే కారణం అయ్యుండొచ్చని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. 

చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి వివాహేతర సంబంధాలకు తన క్యాడర్ పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి కారణాలతోనే మాజీ ఉప ప్రధాని ఝాంగ్ గావోలీ కూడా దాదాపు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.

More Telugu News