Vinesh Phogat: రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, భజరంగ్ పునియాలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

  • చైనాలో ఆసియా క్రీడలు
  • వినేశ్, భజరంగ్ లకు ట్రయల్స్ తో పనిలేకుండా నేరుగా ఎంట్రీ
  • వీరిద్దరికీ మినహాయింపునిచ్చిన అడ్ హాక్ కమిటీ
  • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువ రెజ్లర్లు అంతిమ్ పంఘాల్, సుజీత్ కల్కాల్
  • రిట్ పిటిషన్ ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
Delhi high court denies to interfere exemption for Vinesh anb Bhajrang

భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, భజరంగ్ పునియా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు నేరుగా ఎంపికవడం తెలిసిందే. వీరిద్దరూ ట్రయల్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా భారత ఒలింపిక్ సంఘం అడ్ హాక్ కమిటీ మినహాయింపునిచ్చింది.

అయితే, ట్రయల్స్ లో పాల్గొనకుండానే వీరిద్దరినీ ఎలా ఎంపిక చేస్తారంటూ యువ రెజ్లర్లు అంతిమ్ పంఘాల్, సుజీత్ కల్కాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెలెక్షన్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 

వీరు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆసియా క్రీడల ట్రయల్స్ కు వినేశ్ ఫోగాట్, భజరంగ్ పునియాలకు మినహాయింపునిచ్చిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ ధర్మాసనం కొట్టివేసింది. వినేశ్ ఫోగాట్, భజరంగ్ లకు కల్పించిన మినహాయింపు కొనసాగుతుందని పేర్కొంది. 

మహిళల విభాగంలో వినేశ్ ఫోగాట్ 53 కిలోల కేటగిరీలో, పురుషుల విభాగంలో భజరంగ్ 65 కిలోల కేటగిరీలో ఆసియా క్రీడలకు నేరుగా ఎంట్రీ పొందారు. చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు ఈ నెల 22, 23 తేదీల్లో ట్రయల్స్ చేపడుతున్నారు.

More Telugu News