Pawan Kalyan: ఇప్పుడు మరో అంశంపై పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం!

  • విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌‌తో ట్యాబ్‌లు అందిస్తుండటంపై పవన్ కీలక ప్రశ్నలు
  • డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శ
  • నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టు ఎలా వచ్చిందని నిలదీత
  • ట్యాబ్‌లు మంచివే.. కానీ ముందు స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలని హితవు
janasena chief pawan kalyan questions ysrcp government over contract to byjus

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కొనసాగుతోంది. నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థపై పలు ప్రశ్నలు సంధించిన జనసేనాని.. తాజాగా మరో అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌‌తో కూడిన ట్యాబ్‌లు అందిస్తుండటంపై కీలక ప్రశ్నలు వేశారు.

‘‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు. కానీ నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టు వస్తుంది. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా? టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? వైసీపీ ప్రభుత్వం స్పందించాలి’’ అని పవన్ ట్వీట్ చేశారు.

‘‘ట్యాబ్‌లు మంచివే.. కానీ ముందుగా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. యాప్స్ అనేవి చాయిస్ మాత్రమే. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి” అని హితవు పలికారు. ‘ఫస్ట్ పోస్ట్‌’లో బైజూస్ సంస్థపై వచ్చిన కథనం వీడియో లింక్‌ను షేర్ చేశారు. పలు పత్రికలు, వెబ్‌సైట్ల క్లిప్పింగ్స్‌ను పోస్ట్ చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ట్యాగ్ చేశారు.

More Telugu News