Kumaraswamy: ఎన్డీయేలోకి మరో పార్టీ.. బీజేపీతో కలసి పని చేస్తామన్న కుమారస్వామి

  • రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి పని చేస్తామన్న కుమారస్వామి
  • రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ ప్రతిపక్షాలనే విషయాన్ని ఇప్పటికే చెప్పానని వ్యాఖ్య
  • గత ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్
We will work together with BJP says Kumaraswamy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారుతారని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తారని జేడీఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై నెలకొన్న అంచనాలన్నీ తలకిందులైన సంగతి తెలిసిందే. గత ఎన్నికల కంటే జేడీఎస్ కు తక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కుమారస్వామి పరిస్థితి తారుమారయింది. 

ఈ క్రమంలో కుమారస్వామి కీలక ప్రకటన చేరారు. బీజేపీతో కలిసి పని చేయబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతామని చెప్పారు. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునే అధికారాన్ని పార్టీ అధినేత దేవెగౌడ తనకు ఇచ్చారని తెలిపారు. నిన్న రాత్రి జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సమావేశానంతరం కుమారస్వామి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ప్రతిపక్ష పార్టీలనే విషయాన్ని తాను ఇప్పటికే చెప్పానని కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. వాస్తవానికి కుమారస్వామి ఎన్డీయేలో చేరబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. తాజాగా దీనిపై కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. స్వామి ప్రకటనతో ఎన్డీయేలో మరో పార్టీ చేరబోతోందనే విషయం స్పష్టమయింది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కు 135, బీజేపీకి 65, జేడీఎస్ కు 19 స్థానాలు ఉన్నాయి.

More Telugu News