manipur: మణిపూర్ ఘటన: అందరినీ కోల్పోయాం... తమ గ్రామానికి వెళ్లలేమన్న ఓ బాధితురాలి తల్లి

What Mother Of Woman In Manipur Video saying
  • ఆశాకిరణమైన కొడుకును కోల్పోయానని కన్నీరుమున్నీరు
  • తమ కుటుంబ భవిష్యత్తు ఆలోచిస్తే భయంగా ఉందని వ్యాఖ్య
  • గ్రామమే మంటల్లో కాలిపోయింది... ఏం అర్థం కావడం లేదన్న తల్లి
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులో ఓ బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ... తన భర్తను, కుమారుడ్ని చంపేశారని అన్నారు. ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ... ఇక తాము తమ ఊరికి తిరిగి వచ్చే అవకాశం లేదన్నారు. మణిపూర్ లో మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఓ బాధిత మహిళ తల్లి మాట్లాడారు.

మణిపుర్ లో హింసను ఆపేందుకు ప్రభుత్వం తగినంత చేయలేదన్నారు. తన ఆశాకిరణమైన చిన్న కొడుకును ఈ ఘటనలో పోగొట్టుకున్నానని చెప్పారు. అతనికి మంచి చదువు చెప్పించడం కోసం తాపత్రయపడినట్లు చెప్పారు. ఇప్పుడు తన భర్త కూడా లేడని కంటతడి పెట్టారు. ఇప్పుడు తమ కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే తనకు ఆశాజనకంగా కనిపించడం లేదని, భయంగా ఉందని నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామన్నారు.

ఇక తాము తమ గ్రామానికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని, అసలు తన మదిలో అలా వెళ్లాలనే ఆలోచనే లేదన్నారు. తనకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు. తమ ఇళ్లు తగులబెట్టారని, పొలాలను ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. అలాంటప్పుడు ఇక గ్రామానికి దేనికి వెళతామన్నారు. తమ గ్రామమే మంటల్లో కాలిపోయిందని, తన కుటుంబ భవిష్యత్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. 

తండ్రిని, తమ్ముడిని చంపేయడం నా కూతురు కళ్లారా చూసింది... ఇది తన హృదయాన్ని బాగా గాయపరిచిందన్నారు. ఇక నుండి ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. భగవంతుడి దయ వల్ల తాను ఆరోగ్యంగా ఉన్నానని, కానీ దీని గురించి పగలు, రాత్రి ఆలోచిస్తున్నానని, మానసికంగా బలహీనంగా ఉండటంతో డాక్టర్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. పోలీసులు ఇద్దరు మహిళలను గుంపుకు వదిలేశారని, దీంతో వారిని నగ్నంగా ఊరేగించారన్నారు.
manipur
mother

More Telugu News