tomato: టమాటాలు విక్రయించి కోటీశ్వరుడిగా మారిన మెదక్ జిల్లా రైతు

  • నెల రోజుల్లో రూ.1.80 కోట్లు సంపాదించిన మహిపాల్ రెడ్డి
  • సరిగ్గా టమాటా ధర పెరిగే సమయానికి చేతికి వచ్చిన పంట
  • నెల రోజుల్లో 7 వేల బాక్సుల విక్రయం
Farmer turns crorepathi by selling tomatoes

టమాటాకు భారీ ధర ఉండటంతో కొంతమంది రైతులు ఈ సమయంలో భారీగా ఆర్జిస్తున్నారు. ఇటీవల పూణేకు చెందిన ఓ రైతు టమాటా విక్రయించి రూ.4 కోట్ల వరకు ఆర్జించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లోను టమాటా ద్వారా లక్షలు సంపాదించిన రైతుల గురించి విన్నాం.. చదివాం.. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఓ రైతు టమాటా పంట ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన రైతును టమాటా పంట కోటీశ్వరుడిని చేసింది.

మెదక్‌లోని కౌడిపల్లి మండలానికి చెందిన రైతు బాన్సవాడ మహిపాల్ రెడ్డి 40 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. మహిపాల్ రెడ్డి ఏప్రిల్ 15న కౌడిపల్లిలో ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశాడు. మండు వేసవిలో పంటను కాపాడుకునేందుకు షేడ్ నెట్స్ ఉపయోగించి పెంచాడు. జూన్ మధ్య నాటికి మార్కెట్లో టమాటా సరఫరా తగ్గడంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో మహిపాల్ రెడ్డి పంట చేతికి వచ్చింది.

సాధారణంగా పటాన్‌చెరు, షాపూర్‌, బోయినపల్లి మార్కెట్‌లకు టమాటా సరఫరా చేస్తుంటాడు. జూన్ మిడిల్ నుండి టమాటా ధర పెరుగుతూ వస్తోంది. మహిపాల్ రెడ్డి చేతికి పంట వచ్చే సమయానికి కిలో రూ.100కు చేరుకుంది. ఆ తర్వాత అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ నెల రోజుల్లో ఆయన టమాటా అమ్మకం ద్వారా రూ.1.80 కోట్లు సంపాదించారు. 

తాను ఇరవై ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నానని, కానీ ఒక నెలలో ఇంత డబ్బును ఎప్పుడూ చూడలేదని మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల రోజుల్లో 7వేల బాక్సుల టమాటాలను విక్రయించినట్లు చెప్పారు. ఒక్కో బాక్సును గరిష్ఠంగా రూ.2600కు విక్రయించానని చెప్పారు. గతంలో టమాటాకు ధర లేక కిలో రూ.1 పలికినప్పుడు పారబోసిన సందర్భాలు ఉన్నాయన్నారు. గతంలోను మంచి ధరలు చూశామని, కానీ రూ.100 దాటి, ఈ స్థాయికి పోవడం.. తమ చేతికి ఇంత డబ్బు రావడం ఇదే మొదటిసారి అన్నారు. 

మహిపాల్ రెడ్డి పదో తరగతి ఫెయిలయ్యారు. అయితే భార్య దివ్య సహకారంతో కూరగాయల సాగును ప్రారంభించారు. నారుమళ్లు, ఎరువులు, షెడ్ నెట్స్, సాగు ఖర్చులు, కూలీలు, ఇతరత్రా ఎకరం పంటకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మహిపాల్ రెడ్డి భార్య దివ్య మహమ్మద్ నగర్ గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.

More Telugu News