Cricket: రిషబ్ పంత్ సహా గాయపడ్డ ఆటగాళ్లపై బీసీసీఐ కీలక ప్రకటన!

  • బెంగళూరు క్రికెట్ అకాడమీలో బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, రాహుల్, శ్రేయాస్, రిషబ్
  • వేగంగా కోలుకుంటున్న కేఎల్ రాహుల్
  • పంత్ కూడా కోలుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటన
Big update on KL Rahul Shreyas Iyer Bumrah and Rishabh Pant

భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఇన్నాళ్లు మైదానానికి దూరంగా ఉన్న రిషబ్ పంత్ ప్రాక్టీస్ ను మొదలు పెట్టాడు. గాయపడిన క్రికెటర్లపై బీసీసీఐ ఈ రోజు కీలక ప్రకటన చేసింది. బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్నట్లు తెలిపింది.

మున్ముందు భారీ క్రికెట్ ఈవెంట్స్ ఉండటంతో గాయపడిన కొంతమంది ఆటగాళ్ల పునరాగమనం కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిషబ్, రాహుల్, బుమ్రాలు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు.

కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు. ఆసియా కప్ సమయానికి అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించవచ్చు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు సారథ్యం వహించిన రాహుల్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గాయపడి టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లకు కూడా దూరమయ్యాడు. లండన్ లో సర్జరీ అనంతరం ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ ప్రారంభించాడు.

బుమ్రా, ప్రసిద్ధ కృష్ణలు నెట్స్ లో బౌలింగ్ చేస్తున్నారని, త్వరలో ఫిట్ నెస్ సాధించవచ్చునని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు పునరావాస చివరి దశలో ఉన్నారని, నెట్స్ లో బాగా బౌలింగ్ చేస్తున్నారని, ఇప్పుడు వీరు నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్వహించే కొన్ని ప్రాక్టీస్ గేమ్ లు ఆడతారని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పారు. ప్రాక్టీస్ గేమ్ అనంతరం వారిపై బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. శ్రేయాస్ అయ్యర్ కూడా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

కారు ప్రమాదం కారణంగా ఆటకు దూరమైన పంత్ కూడా కోలుకుంటున్నాడు. బ్యాటింగ్‌తో పాటు నెట్స్‌లో కీపింగ్ చేస్తున్నాడు. రిహాబ్ లో ఉన్న తర్వాత పంత్ లో గణనీయమైన పురోగతి కనిపించిందని, బ్యాటింగ్ తో పాటు నెట్స్ లో కీపింగ్ చేస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ అతని కోసం రూపొందించిన ఫిట్ నెస్ ప్రోగ్రామ్ ను ఫాలో అవుతున్నాడని పేర్కొంది.

More Telugu News