Krishna Mohan Reddy: వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి... వాంగ్మూలంలో కీలక వివరాలు

  • 2019లో వివేకా హత్య
  • దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • ఇప్పటికే పలువురి నుంచి వాంగ్మూలాల సేకరణ
  • జూన్ 30న కోర్టుకు సమర్పించిన సీబీఐ
CBI records statement fro CM Jagan OSD Krishna Mohan Reddy and submitted to court

వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సాక్షిగా పేర్కొంది. ఈ మేరకు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని, కోర్టుకు అందించింది. కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలంలో కీలక వివరాలు పేర్కొన్నారు. 

"ఓ కీలక సమావేశం జరుగుతుండగా అటెండర్ నవీన్ తలుపు తెరిచారు. సమావేశం నుంచి బయటికి రావాలని నవీన్ నన్ను కోరారు. అవినాశ్ రెడ్డి మాట్లాడతారంటూ నవీన్ నాకు ఫోన్ ఇచ్చారు. వివేకానందరెడ్డి మరణించారని అవినాశ్ నాకు ఫోన్ లో చెప్పారు. ఎలా జరిగిందని అవినాశ్ రెడ్డిని అడిగాను. బాత్రూంలో మృతదేహం ఉందని అవినాశ్ చెప్పారు. బాత్రూంలో చాలా రక్తం ఉందని కూడా అవినాశ్ చెప్పారు. దీనిపై జగన్ కు సమాచారం ఇవ్వండి అని చెప్పి అవినాశ్ ఫోన్ పెట్టేశారు. 

వివేకా మరణం విషయం నేను జగన్ కు చెవిలో చెప్పాను. బాత్రూంలో, బెడ్రూంలో రక్తం విషయం కూడా చెప్పాను. జగన్ ముందు ఇంటికి వెళ్లి, ఆ తర్వాత పులివెందుల వెళ్లారు. ఇక, అవినాశ్ తో ఐదుసార్లు ఎందుకు మాట్లాడారని సీబీఐ అడిగింది. బహుశా జగన్ పర్యటన కోసమే అవినాశ్ తో అన్నిసార్లు ఫోన్లో మాట్లాడి ఉంటానని చెప్పాను. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే... జగన్ ఫోన్ వాడరు. పీఏ ఫోన్ లేదా నా ఫోన్ లోనే మాట్లాడతారు" అంటూ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వివరించారు. 

అటు, వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ అటెండర్ జి.నవీన్ వాంగ్మూలాన్ని కూడా సీబీఐ నమోదు చేసింది. "ఉదయం 6.30 గంటలకు అవినాశ్ ఫోన్ చేసి జగన్ ఉన్నారా? అని అడిగారు. కృష్ణమోహన్ రెడ్డి, జీవీడీలతో జగన్ సమావేశంలో ఉన్నారని చెప్పాను. కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వమని అవినాశ్ కోరారు. 

దాంతో, సమావేశం జరుగుతున్న గది వద్దకు వెళ్లి, అవినాశ్ లైన్ లో ఉన్నారంటూ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ ఇచ్చాను. అవినాశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు" అని నవీన్ తన వాంగ్మూలంలో వివరించారు. 

కాగా, ఈ వాంగ్మూలాలను సీబీఐ జూన్ 30న కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం నుంచి వాంగ్మూలాలు సేకరించిన సీబీఐ, వాటిని కూడా కోర్టుకు సమర్పించింది.

More Telugu News