DK Shivakumar: భారత్ లో అత్యంత సంపన్న ఎమ్మెల్యే, అందరికంటే పేద ఎమ్మెల్యే ఎవరంటే...!

  • దేశంలో సంపన్న ఎమ్మెల్యే డీకే శివకుమార్
  • శివకుమార్ ఆస్తి విలువ రూ.1,413 కోట్లు
  • అత్యంత పేద ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా
  • ధారా ఆస్తి 1,700 రూపాయలు
  • జాబితా వెల్లడించిన ఏడీఆర్
India richest and poorest MLAs

ప్రజాసేవ చేసేందుకు అత్యున్నత మార్గం ప్రజాస్వామ్యం-రాజకీయాలు. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. వాళ్లలో కొందరు కోట్లకు పడగలెత్తినవారు ఉంటారు. కాగా, ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా...? ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ విజయభేరి మోగించడంలో కీలకపాత్ర వహించిన డీకే శివకుమార్. 

డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ మాత్రమే కాదు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కూడా. ఆయన ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ మేరకు ఓ జాబితా వెల్లడించింది. 

అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో రెండోస్థానంలో కేహెచ్ పుట్టస్వామి గౌడ ఉన్నారు. ఈయన కూడా కర్ణాటక ఎమ్మెల్యేనే. పైగా స్వతంత్ర ఎమ్మెల్యే. పుట్టస్వామి ఆస్తుల విలువ రూ.1,267 కోట్లు. రూ.1,156 కోట్లు ఆస్తులతో మూడోస్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియా కృష్ణ ఉన్నారు. ప్రియా కృష్ణ సైతం కర్ణాటక ఎమ్మెల్యేనే. 

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఏడీఆర్ జాబితాలో 23వ స్థానంలో ఉన్నారు. అయితే ఆయన కంటే ఆయన అర్ధాంగి అరుణ పేరిటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక, దేశంలో అందరికంటే పేద ఎమ్మెల్యే ఎవరంటే... పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా. ధారా ఆస్తి విలువ తెలిస్తే దిమ్మదిరిగిపోవడం ఖాయం... ఆయన పేరిట ఉన్న ఆస్తి కేవలం 1,700 రూపాయలు. 

ధారా కంటే కాస్త పైన ఒడిశా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మకరంద్ ముదులి ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.15,000 కాగా.... పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యే నరీందర్ పాల్ సింగ్ సావ్నా రూ.18,370తో పేద ఎమ్మెల్యేల్లో ఒకరిగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

దేశంలోని 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటకకు చెందినవారే ఉండడం విశేషం. అంతేకాదు, కర్ణాటక ఎమ్మెల్యేల్లో 14 శాతం మంది రూ.100 కోట్లకు పైబడి ఆస్తి కలిగి ఉన్నవారేనట.

More Telugu News