Pawan Kalyan: నాపై విచారణకు జీవో ఇచ్చారు... జగన్ చూసుకుందాం రా!: పవన్ కల్యాణ్ సవాల్

Pawan Kalyan challenges CM Jagan as govt reportedly issued orders to prosecute
  • జనసేన కార్యాలయానికి జీవో వచ్చిందన్న పవన్
  • జీవో పత్రాలను ప్రదర్శించిన జనసేనాని
  • తాను దేనికైనా సిద్ధమేనని వెల్లడి
  • జగన్ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది అవుతుందని హెచ్చరిక
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ప్రాసిక్యూట్ (విచారణ) చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది అని వెల్లడించారు. జనసేన కార్యాలయానికి ఆ జీవో వచ్చిందని మా వాళ్లు చెప్పారని అని వివరించారు. తనను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆ జీవో ఇచ్చారని తెలిపారు. 

ఈ సందర్భంగా... ఇదిగో ఆ జీవో అంటూ కొన్ని పత్రాలను పవన్ ప్రదర్శించారు. జగన్ కు చెబుతున్నా.... మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. అరెస్టు చేసుకోండి... చిత్రవధ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. తాను దెబ్బలు తినేందుకైనా సిద్ధమని, జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాదు, మీలాగా మర్డర్లు చేసేవారిని వ్యవస్థలు ఎలా కాపాడతాయో ఇక మీదట నేను కూడా చూస్తాను అని హెచ్చరించారు. 

"ఇప్పుడు నా అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్టు అర్థమైంది. ఈ ఒక్క సంఘటనే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అవుతుంది. నేను ఒక మాట చెప్పానంటే ఇక ఎలాంటి రిస్కులకైనా వెనుదీయను. ఓకే జగన్... చెబుతున్నాను కదా... సై అంటే సై... రెడీగా ఉన్నాను... రా... చూసుకుందాం! 

జగన్ గుర్తుపెట్టుకో... యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, వారికి రోజుకు 164 రూపాయల 33 పైసలతో వారిని వాలంటీర్లుగా కొనేశావు. యువతను నువ్వు ఇలా మోసం చేసినందుకు జనసేన పార్టీ కచ్చితంగా తిరగబడుతుంది. జనసేన పార్టీ యువతకు, వాలంటీర్లకు అండగా ఉంటుంది" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

కాగా, పవన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ జీవో నెం.16ను ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. వాలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఈ ప్రాసిక్యూషన్ అని సమాచారం. ఈ జీవో ప్రకారం పవన్ పై సీఆర్పీసీ 199/4 (బి) కింద కేసులు పెట్టేందుకు వీలుంటుంది.
Pawan Kalyan
Jagan
Prosecution
G.O16
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News