G. Kishan Reddy: ఆట వాళ్లే మొదలు పెట్టారు... యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి

  • డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్న
  • నేరస్థుడితో, ఉగ్రవాదితో వ్యవహరించినట్లు తనతో వ్యవహరించారని ఆగ్రహం
  • డబుల్ బెడ్రూం ఇళ్లపై కేసీఆర్ ప్రచార ఆర్భాటమని ఆరోపణ
  • 50 లక్షల ఇళ్లు నిర్మిస్తే కేంద్రం వాటా తెస్తానని సవాల్
Kishan Reddy says BJP is ready to fight BRS government

డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్తే కేంద్రమంత్రి అని కూడా చూడకుండా తన పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా తనకు అక్కడకు వెళ్లే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో కూర్చొని ప్రశ్నించే గొంతులను అణచివేస్తారా? అని నిలదీశారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజల ఆవేదన, ఆక్రోశం తగ్గవన్నారు.

ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... తాము ఉద్యమం చేయలేదనీ, ధర్నా చేయలేదనీ.. డబుల్ బెడ్రూం ఇళ్లు చూసేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలతో వ్యవహరిస్తోందన్నారు. విమానాశ్రయం నుండి తనను నేరస్థుడిలా వెంబడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించారన్నారు. తాము ఏమైనా మత ప్రార్థనలు జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా? అని ప్రశ్నించారు. ప్రజల బాధలు చూసేందుకు వెళ్తే అరెస్ట్ చేయడమేమిటన్నారు.

పేదలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. డబుల్ బెడ్రూంలపై కేసీఆర్ ది ప్రచార ఆర్భాటం తప్పితే ఏం లేదన్నారు. తెలంగాణ సర్కార్ ను మొద్దు నిద్ర లేపడానికే తమ ప్రయత్నమని చెప్పారు. అక్రమ నిర్బంధాలతో తెలంగాణ ఎటువైపు వెళ్తోందని నిలదీశారు. తమను భయంతోనే అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ఆట వాళ్లే మొదలు పెట్టారని.. మేం సిద్ధంగా ఉన్నామని.. ఈ రోజు తెలంగాణలో యుద్ధం మొదలైందన్నారు. ప్రజల కోసం కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్‌తో యుద్ధానికి సిద్ధమన్నారు. తమ రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైందన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే 50 లక్షల ఇళ్లు నిర్మించాలని, కేంద్రం నుండి వచ్చే వాటాను తాము తీసుకు వస్తామన్నారు.

More Telugu News