TS High Court: దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

  • దరఖాస్తుల్లో నో క్యాస్ట్‌’, ‘నో రెలిజియన్‌కాలమ్‌ చేర్చాలన్న హైకోర్టు

  • కులం, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వెల్లడి

  • ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్య
ts high court sensational verdict caste and religion certificates

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యకు సంబంధించిన వాటితోపాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో నో క్యాస్ట్‌’, ‘నో రెలిజియన్‌అనే కాలమ్‌ను తప్పకుండా చేర్చాలని ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. 


తమ కుమారుడికి నో క్యాస్ట్‌.. నో రెలిజియన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప అనే వ్యక్తి పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో  స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ జరిపారు.

 

‘‘పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్‌ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది” అని కోర్టు స్పష్టం చేసింది.


నో క్యాస్ట్‌, నో రెలిజియన్‌ అనే కాలమ్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ సహా అన్ని దరఖాస్తుల్లోనూ చేర్చాలని సూచించింది. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది.

More Telugu News