Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

15 villagers dead due to landslids in Maharashtra
  • బుధవారం అర్ధరాత్రి తర్వాత రాయ్ గఢ్ జిల్లాలో ప్రమాదం
  • ఇర్సల్ వాడి గ్రామంలోని 30 ఇళ్లపై పడ్డ కొండరాళ్లు
  • ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ముఖ్యమంత్రి షిండే
మహారాష్ట్రలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ఇళ్లపై కొండరాళ్లు పడడంతో నిద్రలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, రెస్క్యూ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

రాయ్ గఢ్ జిల్లా ఖలాపూర్ సమీపంలోని ఇర్సల్ వాడి కొండపై ఉన్న గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండపై నుంచి మట్టిపెళ్లలు, రాళ్లు గ్రామంలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గాఢనిద్రలో ఉన్న వారు నిద్రలోనే కన్నుమూశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించాక ముఖ్యమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని చెప్పారు.

సహాయక కార్యక్రమాలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ సిబ్బంది సహా సుమారు 100 మంది రెస్క్యూ పనుల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 75 మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.
Maharashtra
landslids
Raigadh
15 dead
shinde
NDRF

More Telugu News