Etela Rajender: ఈటల రాజేందర్, డీకే అరుణ గృహనిర్బంధం

  • బాటసింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న నేతల హౌస్ అరెస్ట్
  • ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందన్న ఈటల
  • గృహ నిర్బంధం చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని వ్యాఖ్య
Etela Rajender and DK Aruna house arrested

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలతో పాటు పలువురు బీజేపీ నేతలను హైదరాబాద్ లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తామని బీజేపీ నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈటల సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. 

మరోవైపు అరెస్టులపై ఈటల స్పందిస్తూ... డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని అన్నారు. విపక్ష నేతలను అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత తమపై ఉందని... కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమను గృహ నిర్బంధం చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని అన్నారు.

More Telugu News