Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఇంట్లోనే ఉండాలంటూ నగరవాసులకు మేయర్ విజ్ఞప్తి

  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
  • జీహెచ్ఎంసీ పరిధిలో సహాయం కోసం మొబైల్ నెంబర్ ఏర్పాటు
  • జలమయంగా మారిన సిటీ రోడ్లు.. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద
Heavy rains in Hyderabad

హైదరాబాద్ లో గడిచిన 72 గంటలుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, బోరబండ, కూకట్ పల్లి, మాదాపూర్, ఫిల్మ్ నగర్ లలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలలో డీఆర్ఎఫ్ టీమ్ లను అందుబాటులో ఉంచాలని మేయర్ ఆదేశించారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా సిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, నగరవాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం 9000113667 నెంబర్ లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News