Komatireddy Venkat Reddy: మా కార్యాచరణ చెబితే కేసీఆర్ ఇప్పుడే ప్రగతి భవన్ ఖాళీ చేస్తారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • కాంగ్రెస్ పార్టీ నేతలమంతా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న ఎంపీ
  • ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారని ఆరోపణ
  • తలసాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
T Congress meeting in Komatireddy Venkat Reddy house

కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ఇప్పుడే పూర్తిగా చెబితే ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు నెలల తర్వాత ఖాళీ చేసే ప్రగతి భవన్‌ను ఈ రోజే ఖాళీ చేస్తారని ఆ పార్టీ నేత, భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విడతల వారీగా బస్సు యాత్ర చేయాలని, జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నేతలమంతా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నిర్ణయమైనా ఇక పీఏసీలో చర్చించాలన్నారు. విడతల వారీగా బస్సు యాత్రను చేపడతామన్నారు. జిల్లాల్లో భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తమ నేతలలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ముందుకు సాగుతామన్నారు. ఈ నెల 23న పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుందన్నారు. ఈ నెల 30న ప్రియాంక సభలో మహిళా డిక్లరేషన్ ఉండనుందని తెలిపారు.

కాంగ్రెస్ నేతలమంతా స్ట్రాటెజీ రోడ్డు మ్యాప్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. వచ్చే పీఏసీ సమావేశంలో బస్సుయాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అభిప్రాయభేదాలు ఉంటే మరిచిపోతామన్నారు. సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారన్నారు. తాను లాగ్ బుక్ ను బయటపెట్టాక గానీ పలు ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.

బీఆర్ఎస్ పేదల భూములు లాక్కుంటూ, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతోందని ధ్వజమెత్తారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నియంత పాలన నుండి విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పని చేస్తోందన్నారు. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే తన తదుపరి కేటీఆర్ కాకుండా.. బీసీ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అన్నది చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

More Telugu News