Bangladesh: ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియుడి కోసం ఇండియా వచ్చిన బంగ్లాదేశ్ మహిళ

  • పదకొండేళ్ల కూతురుతో వచ్చిన మహిళను పెళ్లాడిన యూపీ యువకుడు
  • పెళ్లి కోసం హిందూ మతంలోకి మారిన మహిళ
  • వీసా రెన్యూవల్ కోసమంటూ భర్తతో పాటు బంగ్లాదేశ్ వెళ్లి గాయబ్
Bangladeshi women came to Uttarpradesh and married local guy

పబ్ జీలో పరిచయమైన యువకుడిని ప్రేమించి, నలుగురు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్ కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీమా హైదర్ పాక్ ఏజెంట్ అంటూ ఆరోపణలు, బెదిరింపు లేఖలు వస్తున్నాయి. దీంతో యూపీ ఏటీఎస్ పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఉదంతమే కొన్నాళ్ల క్రితం అదే యూపీలో చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు అజయ్ తో ప్రేమలో పడి పదకొండేళ్ల కూతురుతో కలిసి బంగ్లాదేశ్ మహిళ జూలీ యూపీకి వచ్చేసింది. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక వీసా రెన్యూవల్ కోసమంటూ భర్తతో కలిసి బంగ్లాదేశ్ బార్డర్ కు వెళ్లింది. రెండు నెలలు గడిచినా ఇప్పటికీ తిరిగి రాలేదు. దీంతో తన కొడుకును వెతికి ఇండియాకు తిరిగి తీసుకురావాలంటూ అజయ్ తల్లి పోలీసులను ఆశ్రయించింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. మొరాదాబాద్ కు చెందిన అజయ్ కి బంగ్లాదేశ్ మహిళ జూలి ఫేస్ బుక్ లో పరిచయమైంది. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీంతో పదకొండేళ్ల తన కూతురితో కలిసి జూలి యూపీకి చేరుకుంది. హిందూ మతంలోకి మారి అజయ్ ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు అంతా సజావుగానే సాగింది. ఇంతలో తన వీసా గడువు ముగుస్తుందని, రెన్యూవల్ చేసుకోవాలని చెబుతూ భర్త అజయ్, కూతురుతో కలిసి జూలి బార్డర్ కు వెళ్లింది.

ఆ తర్వాత అజయ్ తన తల్లికి ఫోన్ చేసి పొరపాటున బార్డర్ దాటి బంగ్లాదేశ్ లోకి అడుగుపెట్టానని, పది పదిహేను రోజుల్లో తిరిగి వస్తానని చెప్పాడు. రెండు నెలలు గడిచిపోయినా తన కొడుకు ఇంకా తిరిగిరాలేదని, తన కొడుకును ఇండియాకు తీసుకురావాలని అజయ్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. కాగా, అజయ్ తల్లి ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేసి అజయ్ తో మాట్లాడామని, తిరిగి వచ్చే ప్రయత్నాల్లోనే ఉన్నానని ఆయన చెప్పాడని పోలీసులు వివరించారు.

More Telugu News