Kharge: ఎన్డీయే భేటీకి వచ్చిన కొన్ని పార్టీల పేర్లే వినలేదన్న ఖర్గేకు మోదీ జవాబు ఇదే..!

Not Heard Of These Parties M Kharge Mocks NDA Meet
  • ఊరూపేరూ లేని పార్టీలంటూ ఎద్దేవా చేసిన ఖర్గే
  • మా కూటమిలో పెద్దా చిన్నా పార్టీలంటూ ఉండవన్న ప్రధాని
  • 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించినా ఏర్పడింది ఎన్డీయే ప్రభుత్వమేనని వెల్లడి
కేంద్రంలోని బీజేపీపై ఉమ్మడి పోరాటానికి ప్రతిపక్షాల నేతలు మంగళవారం బెంగళూరులో భేటీ అయిన విషయం తెలిసిందే. మొత్తం 26 పార్టీలు కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ (ఐఎన్ డీఐఏ) గా ఏర్పడ్డాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు అధికార పక్షం కూడా ఢిల్లీలో కూటమి భేటీ నిర్వహించింది.

ఎన్డీయే భేటీకి మొత్తంగా 39 పార్టీలు హాజరయ్యాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. ఎన్డీయే సమావేశానికి హాజరైన పార్టీలలో కొన్ని పార్టీల పేర్లే తాను ఎన్నడూ వినలేదని ఎద్దేవా చేశారు. ఊరూపేరూ లేని పార్టీలు ఆ మీటింగ్ కు హాజరయ్యాయని విమర్శించారు.

ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ రిటార్ట్ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో చిన్న పార్టీ, పెద్ద పార్టీ అంటూ ఉండవని తేల్చి చెప్పారు. కూటమిలో అన్ని పార్టీలకూ సమాన ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. 2014, 2019 ఎన్నికలలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించిందని మోదీ గుర్తుచేశారు. అయినప్పటికీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడిందని మోదీ వివరించారు.
Kharge
NDA
Narendra Modi
BJP
Congress
alliance

More Telugu News