ITD: కొందరు ఎన్నారైల పాన్ కార్డులు పనిచేయడం లేదా.... ఐటీ శాఖ ఏం చెబుతోందంటే...!

  • పాన్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటున్న ఐటీ శాఖ
  • జూన్ 30తో ముగిసిన గడువు
  • ఇది ఎన్నారైలకు వర్తించకపోయినా... పనిచేయని పాన్ కార్డులు
  • ఎన్నారైల పాన్ కార్డులు ఎందుకు పనిచేయవో కారణాలు వివరించిన ఐటీ శాఖ
IT Dept clarified why some NRIs faces Pan Card inoperative issues

పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో స్పష్టం చేసింది. ఈ మేరకు గడువు కూడా ముగిసింది. పాన్ తో ఆధార్ ను అనుసంధానం చేయకపోతే, ఇలాంటి వారి పాన్ కార్డులు పనిచేయవు. అయితే ఇది ఎన్నారైలకు వర్తించదు. అయినప్పటికీ కొందరు ఎన్నారైల పాన్ కార్డులు పనిచేయడం లేదంటూ ఐటీ శాఖకు వినతులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీనిపై ఐటీ శాఖ స్పందించింది. 

కొందరు ఎన్నారైలు, ఓసీఐ (ఓవర్సీస్ సిటిజెన్ షిప్ ఆఫ్ ఇండియా) వ్యక్తుల పాన్ కార్డులు పనిచేయడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఐటీ శాఖ వెల్లడించింది. కొందరి పాన్ కార్డులు ఎందుకు పనిచేయవన్న దానికి గల కారణాలు వివరించింది.


1. గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఎన్నారైల నివాస స్థితిని ఐటీ విభాగం గుర్తిస్తుంది. లేదా, తమ నివాస స్థితిని ఎన్నారైలు జేఏఓ (జ్యూరిస్ డిక్షనల్ అడ్రెసింగ్ ఆఫీసర్)కు తెలియజేసినా, ఆ విషయాన్ని కూడా ఐటీ విభాగం పరిగణనలోకి తీసుకుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా, వారి పాన్ కార్డులు పనిచేయవు. 

అలాంటి వారు వెంటనే తమ ప్రస్తుత నివాస స్థితిని సంబంధింత జేఏఓకు తెలియజేయాలి. పాన్ కార్డు డేటాబేస్ లో తమ నివాస స్థితిని అప్ డేట్ చేయాలన్న అభ్యర్థనతో పాటు, అందుకు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి. 

2. ఇక ఓసీఐ వ్యక్తులు, విదేశీ పౌరసత్వం కలిగినవారు స్థానిక నివాస చిరునామాలతో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండొచ్చు. తమ ప్రస్తుత నివాస స్థితిని వారు జేఏఓకు సమర్పించకపోవడం, తమ నూతన చిరునామాలను అప్ డేట్ చేయకపోవడం, గడచిన మూడేళ్ల కాలానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడం వల్ల వారి పాన్ కార్డులు పనిచేయకపోవచ్చు.

అలాంటి వారు తమ ప్రస్తుత నివాస స్థితికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జేఏఓకు సమర్పించాలి. పాన్ కార్డు డేటా బేస్ లో తమ ప్రస్తుత నివాస స్థితి వివరాలను అప్ డేట్ చేయాలని జేఏఓకు అభ్యర్థన పెట్టుకోవాలి.

3. పాన్ కార్డు పనిచేయకపోవడం అంటే, ఇక ఆ పాన్ కార్డు ఎప్పటికీ పనికిరాదని భావించరాదు. పాన్ కార్డు పనిచేయకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

అయితే పాన్ కార్డు పనిచేయకపోతే ఉత్పన్నమయ్యే సమస్యలు ఇలా ఉంటాయి...

I. పెండింగ్ లో ఉన్న రిఫండ్ లు చెల్లించరు, అలాంటి రిఫండ్ లపై వడ్డీలు చెల్లించబడవు.
II. సెక్షన్ 206AA ప్రకారం అధికరేటుతో టీడీఎస్ మినహాయించుకుంటారు. 
III. సెక్షన్ 206CC ప్రకారం అధికరేటుతో టీసీఎస్ ను వసూలు చేస్తారు.

వీటన్నింటిని గమనించి ఎన్నారైలు, ఓసీఐ వ్యక్తులు తమ ప్రస్తుత వివరాలను నవీకరించుకోవాలని ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ సూచించింది. ఆ మేరకు జేఏఓ పోర్టల్ వివరాలను కూడా తన ప్రకటనలో పొందుపరిచింది. 

జేఏఓ వివరాలకు https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/knowYourAO పోర్టల్ ను సందర్శించాలని పేర్కొంది.

More Telugu News