కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత

Kerala former chief minister Oommen chandy passes away
  • కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఊమెన్ చాందీ
  • బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో పుట్టిన చాందీ  
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాందీ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఊమెన్ చాందీ గతంలో గొంతు సమస్యలకు ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. 

వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. నిజాయతీ, నిబద్ధత గల వ్యక్తిత్వంతో పార్టీ అధిష్ఠానానికి సన్నిహితుడిగా మారారు. 1970లో ఊమెన్ చాందీ తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అది మొదలు ఆయన విజయయాత్ర అప్రతిహతంగా సాగింది. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా చాందీకి మంత్రి పదవి దక్కింది. 2004-06, 2011-16 మధ్య కాలంలో ఆయనను సీఎం పీఠం దక్కింది.
Go Back to Shorts
Oommen Chandy
Kerala

More Telugu News