K Narayana Swamy: పవన్ కల్యాణ్ కారణంగా చిరంజీవి బాధపడుతున్నారు: ఏపీ ఉపముఖ్యమంత్రి స్వామి

  • ముఖ్యమంత్రివి కావాలనుకుంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని పవన్ కు సలహా 
  • పొత్తుతో ముప్పై సీట్లలో పోటీ చేసి సీఎం ఎలా అవుతావని ప్రశ్న
  • సీట్ల సంఖ్య పెంచుకోవడం కోసమే పవన్ డ్రామాలని విమర్శ
Deputy CM lashes out at Pawan Kalyan

నీ కారణంగా మీ అన్న చిరంజీవి కూడా బాధపడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. పవన్ సోమవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి సీఐ అంజుయాదవ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణస్వామి మాట్లాడారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఇరవై ముప్పై స్థానాల్లో పోటీ చేసే పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఆయనకు నిజంగానే సీఎం కావాలని ఉంటే 175 నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలిపి, ఎన్నికలకు వెళ్లి, మెజార్టీ సీట్లు సాధించాలని సవాల్ చేశారు. అలా గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతాడన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని నారాయణస్వామి జోస్యం చెప్పారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి ఇచ్చే సీట్ల సంఖ్యను పెంచుకోవడం కోసం మాత్రమే జనసేనాని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా ముఖ్యమంత్రివి కాగలవు మహానుభావా... అని నారాయణస్వామి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ రాష్ట్రానికి సింహం లాంటివారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహం లాంటివారని, అలాంటి వారిని ఎదుర్కోగలవా? అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు.

More Telugu News