Bengaluru: బెంగళూరులో ముగిసిన విపక్ష నేతల సమావేశం... రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయం

  • బీజేపీని ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై ప్రధానంగా చర్చ
  • 2024 ఎన్నికలే ముఖ్య అజెండా
  • పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ
  • సమావేశానికి హాజరైన జాతీయస్థాయి నేతలు, ముఖ్యమంత్రులు
Bengaluru will host tomorrow another round of talks between opposition party leaders

కర్ణాటక రాజధాని బెంగళూరులో జాతీయ విపక్ష నేతల సమావేశం ముగిసింది. ఈ సాయంత్రం ప్రారంభమైన సమావేశం 2 గంటల పాటు సాగింది. విపక్ష నేతలు ఈ కీలక భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా బీజేపీని ఎదుర్కోవడంపై సమాలోచనలు చేశారు. జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికల అంశాలు, పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. 

ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ విపక్ష నేత అఖిలేశ్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, వామపక్ష నేతలు సీతారం ఏచూరి, డి.రాజా, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీసీఎం డీకే శివకుమార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

కాగా, సమావేశ అజెండాకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో, విపక్ష నేతలు రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రేపటి సమావేశానికి శరద్ పవార్ కూడా హాజరవుతారని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News