Andhra Pradesh: తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నారు.. సీఎం జగన్ పై మండిపడ్డ యనమల

  • ఆస్తులు లాక్కుంటూ అవినీతి సౌధాలు కట్టుకుంటున్నారని ఫైర్
  • బీసీల విషయంలో జగన్ కొంగజపం చేస్తున్నారని విమర్శ
  • రిజర్వేషన్లు తగ్గినపుడు ప్రభుత్వం ఫైట్ చేయలేదేమని ప్రశ్న
TDP leader Yanamala Ramakrishnudu Press Note

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల దోపిడీకి బలవుతున్నది బీసీలేనని, వారి ఆస్తులు లాక్కుంటూ బీసీల సమాధులపై జగన్ తన అవినీతి సౌధాలు నిర్మించుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న బీసీల ఇళ్లు లాక్కుని రోడ్లు వేసుకున్నారని విమర్శించారు. బీసీలకు జగన్ చేసిన మేలు కన్నా వారి నుంచి దోచుకున్నదే ఎక్కువని విమర్శించారు. ఈమేరకు యనమల రామకృష్ణుడు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల పాలనలో జరిగిన భూ కుంభకోణాలు, వైసీపీ నేతల మైనింగ్ మాఫియాకు బలయిన వారిలో బీసీలే ఎక్కువని యనమల పేర్కొన్నారు.

రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నారన్న యనమల.. మెజారిటీ బీసీలకు జగన్ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. బీసీల ఆస్తులను దుర్మార్గంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. జగనన్న కాలనీలు, పవర్ ప్రాజెక్టులు, పరిశ్రమలు అంటూ బలహీన వర్గాలకు చెందిన వారి నుంచి 12 వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను కనీస పరిహారం కూడా ఇవ్వకుండా లాగేసుకున్నారని ఆరోపించారు. 

బలహీన వర్గాల సంక్షేమ పథకాల్లో కోత కోస్తూ, సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.75,760 కోట్లు దారి మళ్లించారని యనమల విమర్శించారు. బలహీన వర్గాలకు జగన్ తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని యనమల గుర్తుచేశారు. కానీ నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ 28 సార్లు ఢిల్లీ వెళ్లారని అయినా బీసీల జనగణన కోసం ఒక్కసారి కూడా నోరు మెదపలేదని విమర్శించారు.

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారిలో బీసీలే ఎక్కువగా ఉన్నారని యనమల రామకృష్ణుడు చెప్పారు. జగన్ తీరుతో వారు కూడా నష్టపోతున్నారని, న్యాయబద్ధంగా వారికి దక్కాల్సిన కౌలు కూడా ప్రభుత్వం చెల్లించడంలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు రాజకీయ నాయకత్వం లేకుండా అణగదొక్కారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు దాక వెళ్లి జగన్ ప్రభుత్వం కొట్లాడిందని, బీసీల రిజర్వేషన్లు తగ్గినప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్రయించిందని విమర్శించారు.

బీసీల పక్షపాతి అంటే బీసీల నిధులు మళ్లించడమా..? బాపట్లలో బీసీ పిల్లాడిని హత్య చేస్తే స్పందించకపోవడమా..? అని యనమల ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో బీసీ వర్గానికి చెందిన కృష్ణ మాస్టారును వైసీపీ నేతలు కారుతో తొక్కించి, రాడ్లతో కొట్టి, కళ్లు పొడిచి చంపేసినా జగన్ స్పందించలేదని గుర్తుచేశారు. ఇలా హత్యలు, దాడులు చేయించిన జగన్ కు బీసీ అనే పదం పలికే అర్హత ఉందా? అని నిలదీశారు.

కొండలను దోచుకోవడంపైనే అధికార పార్టీ నేతల దృష్టి ఉందని, కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని యనమల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారని, ధరలు పెంచి పేదలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. పేదలపై నిజంగా జగన్ కు ప్రేమ ఉంటే ధరల సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో అన్న క్యాంటీన్లు, రాయితీపై వస్తువుల పంపిణీ, రైతు బజార్లను పటిష్టం చేయడం వంటి కార్యక్రమాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం సదుపాయాల లేమికి నిదర్శనం కాదా అని యనమల ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని చెప్పారు. ఈ స్థాయిలో అణచివేతకు పాల్పడుతూనే బీసీలకు అండగా ఉన్నానంటూ జగన్ చెప్పే బూటకపు మాటలను నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని యనమల స్పష్టం చేశారు.

More Telugu News