Podem veeraiah: కేసీఆర్‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే!

complaint of mla veeraiah in police station against cm kcr
  • భద్రాచలం అభివృద్ధికి నిధులు ఇస్తానన్న సీఎం ఇవ్వలేదన్న పొదెం వీరయ్య
  • గతేడాది వరదల సమయంలో రూ.1,000 కోట్లు ప్రకటించి పట్టించుకోలేదని ఆరోపణ
  • కేసీఆర్‌‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోలీసులకు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయాలని కోరారు. సోమవారం భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధు ప్రసాద్‌కు ఫిర్యాదును అందజేశారు.

‘‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంతవరకు నెరవేర్చలేదు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ఆయన మోసం చేశారు. గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు” అని పొదెం వీరయ్య మండిపడ్డారు.

‘‘గత ఏడాది వరదల సమయంలో భద్రాచలం పట్టణాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన ముఖ్యమంత్రి.. కరకట్ట పటిష్టత, ఎత్తు పెంచడానికి, ముంపు కాలనీల ప్రజలకు పునరావాసం కల్పించడానికి రూ.1,000 కోట్లు ప్రకటించారు. ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయలేదు” అని చెప్పారు. వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News