Kumaraswamy: బీజేపీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న కుమారస్వామి.. విపక్షాల కూటమిపై కీలక వ్యాఖ్యలు!

  • ఎన్డీయే నుంచి తనకు ఇంత వరకు ఆహ్వానం రాలేదన్న కుమారస్వామి
  • విపక్ష కూటమి జేడీఎస్ ను పట్టించుకోలేదని వ్యాఖ్య
  • విపక్ష కూటమి సమావేశం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శ
Kumaraswamy waiting for BJP call

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. మహాఘటబంధన్ పేరుతో విపక్షాలకు చెందిన పలు పార్టీలు ఒకే గొడుగు కిందకు వస్తుండగా... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూడా కీలక పార్టీలకు ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ ఎన్డీయేలో చేరబోతోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. రేపు ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే సమావేశానికి కుమారస్వామి వెళ్లబోతున్నారని చెపుతున్నారు. 

ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు కుమారస్వామి స్పందిస్తూ... తనకు ఇంత వరకు ఎన్డీయే నుంచి ఆహ్వానం అందలేదని తెలిపారు. ఎన్డీయేలో చేరడం గురించి ఆలోచిస్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు మరో 8 నుంచి 9 నెలల సమయం ఉందని... ఈ నేపథ్యంలో పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని కుమారస్వామి అన్నారు. ప్రతి ఎన్నికలకు ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎలా మారుతాయో చూడాలని అన్నారు. దీంతో, బీజేపీ పిలుపు కోసం కుమారస్వామి ఎదురు చూస్తున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. 

మరోవైపు విపక్షాల మహాఘటబంధన్ పై కుమారస్వామి స్పందిస్తూ... తమ జేడీఎస్ ను విపక్ష కూటమి అసలు పట్టించుకోలేదని చెప్పారు. జేడీఎస్ పని అయిపోయిందని వారు భావిస్తుండవచ్చని అన్నారు. దీన్ని తాను పట్టించుకోబోనని చెప్పారు. విపక్షాల సమావేశం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని.. బెంగళూరులో ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను కర్ణాటకలో జేడీఎస్ ను బలోపేతం చేయడం, ప్రజల సమస్యలపై పోరాటం చేయడంపైనే దృష్టిని సారించానని చెప్పారు.

More Telugu News