Maggi noodles: ఐదు రూపాయల మసాలా మ్యాగీ ఎయిర్‌పోర్టులో రూ. 193.. ధర చూసి షాకైన యూట్యూబర్‌!

  • బిల్లు షేర్ చేసిన యూట్యూబర్ సేజల్
  • బహుశా విమాన ఇంధనంతో చేసి ఉంటారని సెటైర్
  • అంత రేటు ఉంటే నువ్వెందుకు కొన్నావంటూ యూజర్ ప్రశ్న
  • అప్పటికే రెండు గంటలుగా ఆకలితో ఉన్నానన్న సేజల్
Maggi Noodles For Rs 193 At Airport

ఆకలేస్తే చటుక్కున గుర్తొచ్చేది మ్యాగీ. రెండు నిమిషాల్లోనే నోరూరించే నూడుల్స్ సిద్ధం కావడంతోపాటు ధర ఐదారు రూపాయలే ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు మనసు పారేసుకుంటారు. అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో అయితే ఎంత ఉంటుంది? మహా అయితే ఓ ఇరవై ముప్పై రూపాయలు ఉండొచ్చు.. అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. బాగా ఆకలిగా ఉండడంతో ఓ విమానాశ్రయంలో మసాలా నూడుల్స్ కొనుగోలు చేసిన ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. కారణం రూ. 193 బిల్లు చేతిలో పెట్టడమే. 

యూట్యూబర్ సేజల్ సూద్ ట్విట్టర్‌లో షేర్ చేసిన నూడుల్స్ బిల్ వైరల్ అవుతోంది. మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. 20 పైసలు తీసేసి రౌండ్ ఫిగర్‌గా 193 బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి గతుక్కుమన్న సేజల్ బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలా రియాక్ట్ కావాలో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

‘మరీ ఇంత రేటా? దీనినేమైనా విమాన ఇంధనంతో చేశారో ఏమో మరి!’ అంటూ రాసుకొచ్చారు. ఎయిర్‌పోర్టులో అత్యంత చవకైన ఫుడ్ అదొక్కటేనని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అంత ధర ఉన్నప్పుడు నువ్వెందుకు కొన్నావన్న ప్రశ్నకు అప్పటికే రెండు గంటలుగా ఆకలిమీద ఉన్నానని, దీంతో ఏదో ఒకటి తినాలనిపించి మ్యాగీ తీసుకున్నట్టు సేజల్ బదులిచ్చారు.

More Telugu News