Carlos Alcaraz: జకో జైత్రయాత్రకు అడ్డుకట్ట... వింబుల్డన్ చాంపియన్ అల్కరాజ్

  • వింబుల్డన్ ఫైనల్ మెట్టుపై జకోవిచ్ కు పరాజయం
  • హోరాహోరీ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ విన్నర్
  • ఐదు సెట్ల పాటు జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్
  • కెరీర్ లో రెండో గ్రాండ్ స్లామ్ సాధించిన అల్కరాజ్
Carlos Alcaraz beats Novak Djokovic to lift maiden Wimbledon title

ప్రపంచ టెన్నిస్ చరిత్రలో నవశకం మొదలైంది. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పురుషుల సింగిల్స్ దిగ్గజ ఆటగాడిగా కొనసాగుతున్న నొవాక్ జకోవిచ్ జోరుకు స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ తెరదించాడు. 

వరల్డ్ నెంబర్ వన్ అల్కరాజ్ వింబుల్డన్ చాంపియన్ గా అవతరించాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో జకోవిచ్ ను మట్టికరిపించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న జకోవిచ్, వింబుల్డన్ పైనా కన్నేశాడు. కానీ అల్కరాజ్ పవర్ గేమ్ ముందు జకో నిలవలేకపోయాడు. 

ఫైనల్ మ్యాచ్ లో తొలి సెట్ ను పేలవంగా ఆరంభించిన అల్కరాజ్... రెండో సెట్ ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లి, జకోవిచ్ పై పైచేయి సాధించాడు. ఆ తర్వాత సెట్లోనూ స్పెయిన్ వీరుడిదే జోరు కనిపించింది. కానీ నాలుగో సెట్ ను 6-3తో చేజిక్కించుకున్న జకోవిచ్ మళ్లీ రేసులోకి వచ్చాడు. మ్యాచ్ ను ఐదో సెట్లోకి మళ్లించాడు. నిర్ణాయక చివరి సెట్లో అల్కరాజ్ శక్తిమేరకు పోరాడి జకోవిచ్ ను ఓడించాడు. అల్కరాజ్ ఓసారి సర్వీస్ బ్రేక్ చేయడంతో జకో పుంజుకోలేకపోయాడు. 

ఈ మ్యాచ్ లో జకోవిచ్ తొడ కండరాల గాయంతో బాధపడడం కనిపించింది. ఓసారి అసహనం తట్టుకోలేక నెట్ పోల్ ను తన టెన్నిస్ రాకెట్ తో బలంగా కొట్టాడు. దాంతో టెన్నిస్ రాకెట్ వంగిపోయింది. 

కాగా, 20 ఏళ్ల అల్కరాజ్ కెరీర్ లో ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు. కాగా, జకోవిచ్ విజేతగా నిలిచి ఉంటే 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో మార్గరెట్ కోర్ట్ వరల్డ్ రికార్డును సమం చేసి ఉండేవాడు.

More Telugu News