Devineni Uma: ఓ మహిళ చేతితో నెడితే పడిపోయేలా ఇళ్లు నిర్మిస్తున్నారు: దేవినేని ఉమ

  • వెలగలేరులో పేదల ఇళ్ల నిర్మాణం వద్ద ఉమ సెల్ఫీ
  • ప్రభుత్వానికి చాలెంజ్
  • వెలగలేరులో ఇళ్ల నిర్మాణం ఓ కేస్ స్టడీ వంటిదని ఎద్దేవా
  • బుడమేరుకు వరద వస్తే కాలనీ మునిగిపోతుందని వెల్లడి
  • కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్
Devineni Uma selfie challenge to YCP Govt

వైసీపీ ప్రభుత్వానికి  టీడీపీ నేత దేవినేని ఉమ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. వెలగలేరులో పేదల ఇళ్ల నిర్మాణం వద్ద సెల్ఫీ తీసుకున్న ఉమ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వెలగలేరులో ఇళ్ల నిర్మాణం అందరికీ ఓ కేస్ స్టడీ వంటిదని ఎద్దేవా చేశారు. 

సీఎం జగన్, మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్... మీరు చెబుతున్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పరిస్థితి ఇలా ఉంది అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓ మహిళ చేతితో నెడితే పడిపోయేలా కాలనీ ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. పేదల ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. బుడమేరులో ఆకస్మిక వరద ఎప్పుడు వస్తుందో తెలియదని, వరద వస్తే కాలనీ మొత్తం మునిగిపోకతప్పదని ఉమ హెచ్చరించారు. 

పేదల కోసం చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను జగన్ ఇవ్వడంలేదని ఆరోపించారు. రంగులు వేసుకుని గుడివాడలో మాత్రం ఇచ్చారని వెల్లడించారు. 

కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని, ఇళ్ల నిర్మాణం చేపట్టి ఏజెన్సీపై కలెక్టర్ విచారణ జరిపించి బ్లాక్ లిస్టులో పెట్టాలని ఉమ డిమాండ్ చేశారు.

More Telugu News