tdp: రాజకీయ కారణాలతో టీచర్‌‌ను చంపడం దారుణం:చంద్రబాబు

Chandra Babu Strongly Condemns Govt Teacher Murder in Vizianagaram District
  • విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి 
    హత్యను తీవ్రంగా ఖండించిన బాబు
  • బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ 
  • విజయనగరం జిల్లా రాజాంలో టీచర్ ఏగిరెడ్డి కృష్ణను దారుణ హత్య చేసిన ప్రత్యర్థి వర్గం
విజయనగరం జిల్లా, రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక ఉపాధ్యాయుడిని చంపడం దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ (58) అదే మండలం కాలవరాజు పేటలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రాజాం పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. టీడీపీ సానుభూతిపరుడిగా ఆయనకు పేరుంది. ఐదేళ్ల పాటు ఉద్దవోలు సర్పంచ్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. 

కాగా, శనివారం ఎప్పటిలాగే రాజాం నుంచి తన ద్విచక్ర వాహనంపై తెర్లాం మండలం కాలవరాజుపేట వైపు కృష్ణ బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు వ్యానుతో కృష్ణ బైకును వేగంగా ఢీకొట్టారు. కిందపడ్డ కృష్ణను రాడ్లతో బలంగా కొట్టి హత్య చేశారు. గ్రామంలోని ప్రత్యర్థి వర్గం ఆయనను హత్యచేసినట్టుగా భావిస్తున్నారు. ఏగిరెడ్డి కృష్ణ హత్యతో తెర్లాం మండలం ఉద్వవోలు ఉద్రిక్తతగా మారింది. బాధిత వర్గానికి చెందినవారు నిందితుల ఇళ్లను ముట్టడించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
tdp
Chandrababu
Vizianagaram
govt teacher
murder
YSRCP

More Telugu News