tomato: చిత్తూరు నుండి పాట్నాకు రాయితీ టమాటా.. నష్టాన్ని భరిస్తోన్న కేంద్రం

  • ఢిల్లీ-ఎన్సీఆర్, పాట్నాలలో రూ.90కే కిలో టమాటా విక్రయం
  • రేపటి నుండి 20 వేల కిలోల టమాటాలను విక్రయిస్తామని వెల్లడి
  • చిత్తూరు నుండి రూ.115కు కొనుగోలు చేసి, రూ.90కి విక్రయిస్తున్న నాఫెడ్
Govts Discount Sale Of Tomatoes Starts In Delhi NCR Patna

చుక్కలనంటిన టమాటా ధరలు ప్రజలకు భారంగా మారాయి. దీంతో అధిక ధరలు ఉన్నచోట తక్కువ ధరకు విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్సీసీఎఫ్, నాఫెడ్ దేశ రాజధాని ఢిల్లీ, పాట్నాలలో కిలో టమాటా ధరను రూ.90కి విక్రయించడం ప్రారంభించాయి. కేంద్రం తరఫున ఈ కోఆపరేటివ్ సంస్థలు టమాటాలను విక్రయిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో కిలో రూ.250ని కూడా తాకింది. దీంతో కేంద్రం అధిక ధరలు ఉన్నచోట తగ్గింపు ధరకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టింది.

సాయంత్రం వరకు 17,000 కిలోల టమోటాలలో 80 శాతం అమ్ముడయ్యాయని, తాము రేపటి నుండి ఢిల్లీ-ఎన్సీఆర్‌లో మరింత ఎక్కువ టమాటాలను విక్రయించే ప్రయత్నం చేస్తామని ఎన్సీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. 

టమాటాలు రాయితీతో చాలా తక్కువ ధరకు వస్తుండటంతో చాలాచోట్ల ప్రజలు వరుస కడుతున్నారు. ఢిల్లీలోని కరోల్ బాగ్, పటేల్ నగర్, పూసా రోడ్, సిజిఓ కాంప్లెక్స్, నెహ్రూ ప్లేస్, గోవింద్ లాల్ షికా మార్గ్, ఆదర్శ్ నగర్, వజీర్‌పూర్‌లోని జెజె స్లమ్, ధోధాపూర్ శివమందిర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 20 మొబైల్ వ్యాన్ల ద్వారా రాయితీ టమాటాను విక్రయిస్తున్నారు. నోయిడాలో మూడు మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశారు.

ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కలిగిన ఏ గ్రేడ్ టమాటాలను విక్రయిస్తున్నామని, రేపటి నుండి 20వేల కిలోలకు పైగా విక్రయిస్తామని చంద్ర తెలిపారు. ఆదివారం నుండి ఢిల్లీలో 100 వరకు ఔట్ లెట్ల ద్వారా టమాటాలు విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రాయితీ టమాటాను విక్రయించే అంశంపై మదర్ డెయిరీతో ఎన్సీసీఎఫ్ చర్చలు జరుపుతోంది.

మరోవైపు నాఫెడ్ కూడా బీహార్ లోని పాట్నాలో కిలో రూ.90కి విక్రయిస్తోంది. 20 టన్నుల టమాటా ట్రక్కు ఈ రోజు పాట్నాకు చేరుకుందని, అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన కిలో రూ.90 ధరకే విక్రయిస్తున్నామని నాఫెడ్ ఛైర్మన్ బిజేంద్ర సింగ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుండి కిలో టమాటాను రూ.115 చొప్పున కొనుగోలు చేసింది నాఫెడ్. పాట్నాకు టమాటా రవాణాకు కిలోకు రూ.6 ఖర్చు అవుతోంది. మొత్తం కిలో టమాటాకు రూ.121 ఖర్చు వస్తోందని తెలిపారు. రాయితీ టమాటా నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది.

టమాటాల సగటు రిటైల్ ధర శుక్రవారం రూ.116.76గా ఉంది. గరిష్ఠ రేటు రూ.244, కనిష్ఠంగా కిలో రూ.40గా ఉంది. మెట్రో నగరాల్లో టమాటా ధరలు చూస్తే ఢిల్లీలో రూ.178, ముంబైలో రూ.147, కోల్‌కతాలో రూ.145, చెన్నైలో రూ.132గా ఉంది.

More Telugu News