Sai Pallavi: వృద్ధులైన తల్లిదండ్రులను అమర్ నాథ్ యాత్రకు తీసుకెళ్లడం సవాల్ లా అనిపించింది: సాయిపల్లవి

  • అమర్ నాథ్ యాత్రకు వెళ్లొచ్చిన సాయిపల్లవి
  • ఎంతోకాలంగా ఈ యాత్ర గురించి కలలు కన్నామని వెల్లడి
  • తల్లిదండ్రులు యాత్ర సందర్భంగా ఇబ్బందికి గురయ్యారన్న సాయిపల్లవి
  • అమర్ నాథ్ యాత్ర తన సంకల్పానికి పరీక్షలా నిలిచిందని వెల్లడి
Sai Pallavi talks about Amarnath Yatra

అందం, అభినయం, నాట్య కౌశలం కలగలిసిన తార సాయిపల్లవి. ఇటీవల టాలీవుడ్ కు కాస్త దూరమైన సాయిపల్లవి, తమిళంలో మాత్రం శివకార్తికేయన్ సరసన ఓ చిత్రం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించిన ఈ అమ్మడు, సోషల్ మీడియాలో అభిమానులను పలకరించింది. తాజాగా, అమర్ నాథ్ యాత్ర విశేషాలను సాయిపల్లవి అభిమానులతో పంచుకుంది. సాయిపల్లవి ఇటీవల తల్లిదండ్రులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు వెళ్లొచ్చింది.

తాము ఎంతోకాలం నుంచి ఈ యాత్ర గురించి కలలు కన్నామని, అమర్ నాథ్ యాత్ర తన సంకల్ప శక్తికి పరీక్షలా అనిపించిందని సాయిపల్లవి తెలిపింది. "60 ఏళ్ల వయసున్న మా అమ్మానాన్నలను ఎంతో కఠినమైన అమర్ నాథ్ యాత్రకు తీసుకెళ్లడం ఓ సవాల్ లాగా అనిపించింది. ఒక్కోసారి వారు నడవలేక ఆయాసంతో ఊపిరి కూడా తీసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితులు చూసి, ఎందుకు స్వామీ అంతదూరంలో కొలువుదీరావు అని ప్రశ్నించాను. కానీ, ఒక్కసారి ఆ దేవదేవుడి దర్శనం అయ్యాక నా ప్రశ్నకు సమాధానం దొరికినట్టయింది. 

దర్శనం అనంతరం కొండ దిగి వస్తున్నప్పుడు ఓ అద్భుత ఘట్టం చూశాను. దైవ దర్శనానికి వెళుతున్న కొందరు భక్తులు ముందుకు వెళ్లలేక అవస్థలు పడుతుండగా, ఇతరులు ఓం నమఃశివాయ అంటూ గట్టిగా జపించడం, దాంతో భక్తుల్లో కొత్త ఉత్సాహం వచ్చి వారు మళ్లీ యాత్రను కొనసాగించడం గమనించాను. 

మనిషి జీవితం కూడా ఒక తీర్థయాత్ర వంటిదే అని నాకు అమర్ నాథ్ యాత్ర ద్వారా బోధపడింది. సాటి మనుషులకు సాయపడకపోతే మనం చనిపోయినవాళ్లకిందే లెక్క అనే విషయం కూడా అర్థమయ్యేలా చేసింది ఈ పరమ పవిత్ర యాత్ర" అని సాయిపల్లవి వివరించింది.

More Telugu News