Bengaluru: ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా ఇంటర్వ్యూ పాస్ కావాలట.. బెంగళూరులో టెకీకి వింత అనుభవం!

  • జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ గా సాగిందన్న హంగర్ బాక్స్ కో ఫౌండర్
  • బోనస్ గా బిజినెస్ నడపడంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారని వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
 Bengaluru Landlord Intervies Tenant on His Business Model and Investors

ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఎదుర్కోవాలన్న విషయం మనకు తెలిసిందే.. కానీ, అద్దె ఇంటి కోసం తాను ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సి వచ్చిందని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి, హంగర్ బాక్స్ కో ఫౌండర్ నీరజ్ మెంటా చెప్పుకొచ్చారు. ఇటీవల బెంగళూరులో ఈ వింత అనుభవం ఎదురైందని చెప్పారు. అచ్చంగా కార్పొరేట్ జాబ్ ఇంటర్వ్యూలా ఆద్యంతం సాగిన ఇంటర్వ్యూకు సదరు ఇంటి యజమాని ఫినిషింగ్ టచ్ కూడా అలాగే ఇచ్చారని వివరించారు. ఇంటిని తనకు అద్దెకు ఇచ్చేదీ లేనిదీ ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తానని సాగనంపాడని చెప్పుకొచ్చారు.

ఇంటి యజమాని చేసిన ఈ ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ సైజు తదితర వివరాల గురించి అడిగారని నీరజ్ చెప్పారు. మధ్యవర్తి ద్వారా అప్పటికే తన గురించి తెలుసుకున్న యజమాని.. తన స్టార్టప్ గురించి కూడా నెట్ లో సమాచారం సేకరించినట్లు ఆయన ప్రశ్నలను బట్టి తనకు అర్థమైందన్నారు. కుటుంబానికి సంబంధించిన ప్రశ్నల తర్వాత తన స్టార్టప్ గురించి కూడా పలు ప్రశ్నలు సంధించారని నీరజ్ తెలిపారు. అంతేకాదు, బిజినెస్ ఎలా నడపాలనే విషయంపై తనకు ఉచిత సలహాలు కూడా ఇచ్చారని వివరించారు.

ఇంటి అద్దె తన భార్య చెల్లిస్తుందని చెప్పగా.. అప్పటికప్పుడు ఆమె లింక్ డ్ ఇన్ ప్రొఫైల్ చెక్ చేసి చూశాడని పేర్కొన్నారు. అంతా పూర్తయిందనే సమయంలో తన ఇంటిని అద్దెకు తీసుకోవడానికి మరో ఇద్దరు ఆసక్తి చూపిస్తున్నారని, వారితో కూడా మాట్లాడాక ఏ విషయం చెబుతానని తనను సాగనంపాడని నీరజ్ వివరించారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ గా మారింది. బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతకడం ఎంత కష్టమో ఈ సంఘటనతో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More Telugu News