Alia Bhatt: కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేతితో తీసిచ్చిన నటి ఆలియా.. వీడియో వైరల్!

Alia Bhatt Picks Up Paparazzos Slipper Outside Mumbai Restaurant
  • తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని రెస్టారెంట్‌కు వెళ్లిన ఆలియా
  • బయటకు వస్తుండగా ఫోటో కోసం ఆమెను చుట్టుముట్టిన జర్నలిస్టులు
  • ఈ హడావుడిలో చెప్పు జారవిడుచుకున్న విలేకరి 
  • ఆలియా సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే, ఇటీవల తన తల్లి, సోదరితో కలిసి ఆమె ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ చిన్న పని నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులకు ఆమెను మరింత దగ్గర చేసింది. 

రెస్టారెంట్ నుంచి ఆలియా తన కుటుంబసభ్యులతో కలిసి బయటకు వస్తుండగా జర్నలిస్టులు ఆమెను చుట్టుముట్టారు. ముగ్గురూ కలిసి ఓ ఫొటోకు పోజివ్వండంటూ తెగ రిక్వెస్ట్ చేశారు. ఇంతలో అక్కడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను వెనక్కు జరగమని చెప్పారు. ఈ హడావుడిలో ఓ ఫొటో జర్నలిస్ట్ చెప్పు ఊడి కింద పడిపోయింది. తన కారువైపు వస్తున్న ఆలియాకు ఆ చెప్పు కనబడింది. ‘‘ఎవరో చెప్పు జారవిడుచుకున్నట్టు ఉన్నారు.. ఇది ఎవరిదీ?’’ అని ఆమె ప్రశ్నించింది. 

జర్నలిస్టులేమో కంగారుగా.. ‘‘మీరేం పట్టించుకోకండి.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జర్నలిస్టులు వద్దంటున్నా వినకుండా ఆలియా కింద ఉన్న చెప్పును తీసుకుని వారికి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అంత పెద్ద స్టార్ అయిన ఆలియా సింప్లిసిటీ చూసి జనాలు ముచ్చటపడుతున్నారు.
Alia Bhatt
Viral Videos
Mumbai
Bollywood

More Telugu News