Supreme Court: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

  • ప్రమాణం చేసిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ 
  • 34కు గాను 32కి చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
  • మదనపల్లెలో జన్మించిన జస్టిస్ ఎస్.వెంకటనారాయణ
CJI Chandrachud administers oath of office to Justices Bhuyan and Bhatti

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్,  జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు సంఖ్యాబలం 34 కాగా, కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల రాకతో  జడ్జీల సంఖ్య 32కు చేరింది. మరో రెండు ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వెంకటనారాయణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫారసు చేసింది. వీరి పదోన్నతికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

తెలుగువారైన జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి 1962 మే 6న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పని చేసిన ఆయన 2019లో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది జూన్ 1 కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1964 ఆగస్టు 2న జన్మించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. గతేడాది జూన్ 29న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో ముంబై హైకోర్టు జడ్జిగా ఆయన సేవలందించారు.

More Telugu News