Nara Lokesh: తెలుగులో ఒక పదం అటు ఇటు తూలితే కూడా నన్ను అవమానించారు: నారా లోకేశ్

  • యువగళం పాదయాత్రకు రెండ్రోజుల విరామం
  • మంగళగిరి కోర్టుకు వచ్చిన లోకేశ్
  • కోర్టుకు ఎందుకు వచ్చిందీ వివరించిన లోకేశ్
  • తనపై దుష్ప్రచారం చేసేవాళ్లపై దావా వేసినట్టు వెల్లడి
  • ఆ వివరాలను మీడియాతో పంచుకున్న వైనం
Nara Lokesh press meet in Mangalagiri

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ మంగళగిరిలో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు రెండ్రోజుల విరామం ఇచ్చిన లోకేశ్... కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తనను లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. తాను కార్నెగీ మిలాన్, స్టాన్ ఫోర్డ్ వంటి ప్రపంచస్థాయి విద్యాసంస్థల్లో చదివానని, అయితే, అందుకైన ఖర్చును ఇంకెవరో భరించారని నాడు కాంగ్రెస్ పాలనలో ప్రచారం చేశారని లోకేశ్ వివరించారు. అయితే, విదేశాల్లో తన విద్యాభ్యాసానికైన ఖర్చును తన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి చెల్లించారన్న విషయాన్ని అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపించామని తెలిపారు. 

ఆ తర్వాత, తనకు రెండో పెళ్లయిందని, తనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడంటూ మరో ప్రచారం చేశారని లోకేశ్ వెల్లడించారు. లేని ఫొటోలను మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపారు. తన శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని కూడా కించపరిచేలా వ్యాఖ్యానించారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

"నేను చిన్నప్పటి నుంచి చదివింది ఇంగ్లీషు మీడియంలోనే. తెలుగులో ఒక్క పదం అటు ఇటు తూలినా నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు... వ్యక్తిగతంగా అవమానించారు. అయినా నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే ఈ వైసీపీ నాపై ఆరోపణలు చేయడం ప్రారంభించింది. 

స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందని, అందుకు నేనే కారణం అన్నారు. వెంకటేశ్వరస్వామి నుంచి పింక్ డైమండ్ స్వాహా చేశామన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అందులో నేను పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారు. ఫైబర్ గ్రిడ్ లో కూడా భారీ అవినీతి జరిగిందని, అందుకు కూడా లోకేశ్ కారణమన్నారు. 

యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోసం నేను ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తే, వాళ్లకిచ్చే రాయితీల్లో కూడా కుంభకోణం జరిగిందని నాపై వైసీపీ వాళ్లు లేనిపోని ఆరోపణలు చేశారు. రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒక పుస్తకం కూడా ప్రచురించారు. అందులో 6 పైసల అవినీతి జరిగినట్టు కూడా నిరూపించలేకపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం. 

2019 ఓటమి తర్వాత కూడా నాపై తప్పుడు ప్రచారం కొనసాగింది. వ్యక్తిగతంగా నేను అనని మాటలు అన్నానని, ఒక కులాన్ని దూషించానని అనేక ఆరోపణలు చేశారు. వీటన్నింటికి నేను చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇకపై ఏ మీడియా చానల్ కానీ, పత్రిక కానీ తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు రాతులు రాసినా... లేక ఏ వైసీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వాళ్లందరిపై పరువునష్టం కేసు వేస్తాను. 

నేను మంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ ఎయిర్ పోర్టులో రూ.25 లక్షల విలువైన భోజనం చేశానని సాక్షి, డెక్కన్ క్రానికల్, ది వీక్ పత్రికల్లో రాశారు. దాంతో ఆ మూడు పత్రికలపై పరువునష్టం దావా వేశాను. నేను ఏ ఏ రోజుల్లో అయితే అక్కడ భోంచేశానని రాశారో, వాస్తవానికి ఆ రోజుల్లో నేను వైజాగ్ లోనే లేను. అందుకు అన్ని ఆధారాలు బయటపెట్టాను. 

దాంతో, తాము రాసింది తప్పుడు ఆర్టికల్ అని ది వీక్ తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పింది. కానీ సాక్షి, డెక్కన్ క్రానికల్ మాత్రం స్పందించలేదు. దాంతో సాక్షిపై రూ.75 కోట్లు, డెక్కన్ క్రానికల్ పై రూ.25 కోట్లకు దావా వేశాను. 

ఇక రెండో విషయం... ఎమ్మెల్సీ పోతుల సునీత నా తండ్రి చంద్రబాబు, తల్లి భువనేశ్వరి, నా భార్య బ్రాహ్మణిని వ్యక్తిగతంగా దూషించారు. వారు నీతినిజాయతీగా వ్యాపారం చేస్తుంటే, అది అక్రమ వ్యాపారం అని, సారా వ్యాపారం అని, నా తల్లి, భార్య తాగుతారని... ఇంకా అనేకానేక ఆరోపణలు చేశారు. వారు మాట్లాడిన విధానం చూస్తే నాకే చాలా బాధేసింది. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని పోతుల సునీతను కోరాం. కానీ ఆమె అంగీకరించలేదు. దాంతో ఆమెపై రూ.50 కోట్లకు క్రిమినల్ దావా వేశాను. ఆమె స్పందించకపోవడంతో ఇవాళ మొదటి కేసు ఆమెపైనే వేయడం జరిగింది. 

మరో కేసు ఏంటంటే... మా పిన్ని చనిపోయినప్పుడు ఆమె మరణానికి కారణం నేనే అని, ఆస్తి తగాదాలే కారణమని వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి ట్విట్టర్ లో ఆరోపణలు చేశాడు. నాకు అక్కాచెల్లెళ్లు లేరు. మా పిన్నమ్మకు ఇద్దరు కూతుళ్లను నా సొంత చెల్లెళ్లుగా భావిస్తాను. వారిని కన్నబిడ్డల్లా భావించి మా అమ్మ వారిద్దరి పెళ్లిళ్లు చేసింది.

కానీ, మా పిన్నితో మాకు ఆస్తి గొడవలు ఉన్నాయని, మా పిన్ని మా ఇంటికి వస్తే నేను దాడి చేశానని, దూషించానని దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించాడు. కొంత భూమిని నా పేర రాయించుకోవాలని ప్రయత్నం చేశానని అతడు ప్రచారం చేశాడు. రోడ్ నెం.45లో ఆ సర్వే నెంబరుతో ఎలాంటి భూమి లేదు. దాంతో దేవేందర్ రెడ్డిపైనా రూ.50 కోట్లకు క్రిమినల్ దావా వేశాను. అందులో భాగంగానే ఇవాళ మంగళగిరి కోర్టుకు హాజరయ్యాను.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.... ఇకపై ఎవరైనా మా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను. పరిస్థితిని బట్టి సివిల్ దావా, క్రిమినల్ దావా వేస్తాను. అవాస్తవాలు రాసే ఏ పత్రికను కూడా ఉపేక్షించేది లేదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. ఈ లోకేశ్ ఏనాడూ తప్పు చేయలేదు. ఇకముందు కూడా చేయడు. నాపై దుష్ప్రచారం చేస్తే ఎంత కఠినంగా వ్యవహరించాలో అంత కఠినంగా వ్యవహరిస్తా" అని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News