Congress: రేవంత్ ‘కరెంట్’ కామెంట్లపై రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్

  • కమీషన్ల కోసం బీఆర్ఎస్ 24 గంటల ఉచిత కరెంట్ నినాదాన్ని తెచ్చిందన్న రేవంత్
  • రైతులకు 8 గంటలు నిరంతర విద్యుత్ సరిపోతుందనడంపై దుమారం
  • రాష్ట్ర పార్టీని ఇరకాటంలోకి నెట్టిన రేవంత్ వ్యాఖ్యలు
Congress high command steps in on Revanth power comments

ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ తర్వాత జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాస్త ఇరకాటంలో పడింది. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ‘కరెంట్‌’ షాక్ ఇద్దామని అనుకుంటే దానికే ఆ షాక్ తగిలినంత పనైంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో పెనుదుమారాన్ని రేపాయి. 

కమీషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ నినాదాన్ని తెచ్చిందని, రైతులకు 8 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తే చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే షాక్ ఇచ్చాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు ఆందోళనలు చేశాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత జటిలం చేశాయి. 

దీంతో హైకమాండ్ రంగంలోకి దిగకతప్పలేదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు వ్యక్తిగతంగానే తీసుకోవాలని, ఇందులో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టినవే తుది నిర్ణయాలని వివరించారు. దీంతో రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీతక్క సీఎం అంటూ పార్టీలో అలజడి రేపిన రేవంత్ ఉచిత కరెంట్ గురించి మాట్లాడుతూ పార్టీకి ఇబ్బంది కలిగించారని భావిస్తున్నారు. దాంతో, ఈ ఎపిసోడ్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మరికొందరు పెద్దలు కూడా రంగంలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News