UK: యూకే వెళ్లాలనుకునే వారికి ఓ బ్యాడ్ న్యూస్!

  • వీసా ఖర్చులు పెరగనున్నట్టు వెల్లడించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
  • వైద్య సంబంధిత సర్‌ఛార్జ్, ఇతర వీసా ఖర్చులు పెరుగుతాయని వెల్లడి
  • బ్రిటన్ ప్రభుత్వ వైద్యుల జీతాలు పెరగనున్న నేపథ్యంలో వీసా ధరలూ పెరుగుతాయని వ్యాఖ్య 
UK visa fees health surcharge to rise to meet higher costs Sunak

యూకే వెళ్లాలనుకునే వారికి ఓ బ్యాడ్ న్యూస్! ఇకపై అక్కడి వీసా ఖర్చులు పెరగనున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్వయంగా ప్రకటించారు. వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్‌చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన గురువారం స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది జీతాలు పెంచనున్న నేపథ్యంలో వీసాకు సంబంధించిన వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయని అన్నారు. 

టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఇటీవల బ్రిటన్‌లోని ఓ స్వతంత్ర కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని బ్రిటన్‌ ప్రధానిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సిబ్బంది సగటు వేతనాలు 5 నుంచి 7 శాతం మేర పెరుగుతాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఖర్చులకు అప్పులు చేసి నిధులు సమీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యకు పూనుకోమని స్పష్టం చేశారు. అయితే, ఈ నిధులు ఏదో ఒక మార్గంలో సమకూరాలని కాబట్టి, వీసా ఖర్చులు పెరుతాయని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News