Cartwheels: ప్లాట్‌ఫామ్‌పై గాల్లో పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని లోపలేసిన పోలీసులు.. వీడియో ఇదిగో!

  • బీహార్‌లోని మాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • అరెస్ట్ చేసినట్టు చెబుతూ వీడియోను షేర్ చేసిన పోలీసులు
  • అరెస్ట్ ఎలా చేస్తారంటూ నిలదీస్తున్న నెటిజన్లు
  • మంచిపనే చేశారంటున్న మరికొందరు
Man Arrested For Doing Cartwheels At Railway Platform In Bihar

యువతీయువకులు ఇటీవల రైళ్లలో స్టంట్లు, ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ లైకుల కోసం పాకులాడుతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరుగుతున్న వరస ఘటనలు అందుకు నిదర్శనం. తాజాగా ఓ యువకుడు బీహార్‌లోని మాన్పూరు జంక్షన్ రైల్వే ప్లాట్‌ఫాంపై గాల్లో పిల్లి మొగ్గలు (కార్ట్‌వీల్స్) వేస్తూ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్‌లో న్యూసెన్స్ చేసినందుకు గాను అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. లైకులు, షేర్ల కోసం పాకులాడుతున్న వారికి ఇదొక గుణపాఠం కావాలని పేర్కొన్నారు. 

అంతవరకు బాగానే ఉన్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు రెండుగా చీలిపోయారు. ఎక్కువమంది యువకుడి చేష్టలను వ్యతిరేకించగా, మరికొందరు మాత్రం అలా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులపై మండిపడుతున్నారు. హెచ్చరించి వదిలేయాలి కానీ, అరెస్ట్ చేసేయడమేనా? అని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టి ఉండాల్సిందని అంటుండగా, మరికొందరు మాత్రం మంచి పనే చేశారని, ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటే ఇలా చెలరేగిపోతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తుంటారని పేర్కొన్నారు.

More Telugu News