Haryana: హర్యానాలో ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన మహిళ.. ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం!

Woman slaps Haryana MLA over floods asks Why have you come now
  • హర్యానాలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలతో ప్రజల అవస్థలు
  • ఘూలా ప్రాంతంలో వర్షాలకు ఓ చిన్న డ్యామ్‌ దెబ్బతినడంతో ముంచెత్తిన వరద
  • ఆ ప్రాంతమంతా నీట మునగడంతో ప్రజల ఇక్కట్లు
  • తమను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై ఆగ్రహం
  • ఇంతలో అకస్మాత్తుగా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న మహిళ, నెట్టింట వీడియో వైరల్
హర్యానాలో అసాధారణ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
ఇటీవల కురిసిన వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న చిన్న డ్యామ్‌ దెబ్బతినడంతో ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యే బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ అవస్థలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. తమ దీనస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. ఇంతలో ఓ మహిళ అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చింది. ‘ఇప్పుడెందుకు వచ్చావ్?’ అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలిచారు. 

కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ స్పందించారు. ‘‘నేను తలుచుకుని ఉంటే డ్యామ్ దెబ్బతినేది కాదని ఆ మహిళ ఆరోపించింది. అది ఓ ప్రకృతి విపత్తని నచ్చజెప్పేందుకు నేను ప్రయత్నించా. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయాన్ని చెప్పా’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ఆమెను తాను క్షమించానని, ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని అన్నారు.
Haryana
Viral Videos

More Telugu News