Janasena: వాలంటీర్లు నాకు సోదర సమానులు.. వారి పొట్టకొట్టాలనేది నా ఉద్దేశం కాదు: పవన్ కల్యాణ్

Janasena never blame YS Jagans wife says Pawan Kalyan
  • జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని ప్రశ్న
  • వాలంటీర్లు అందరూ చెడ్డవారు కాదు.. కానీ కొందరు కిరాతకులున్నారని వ్యాఖ్య
  • ఏపీలో మద్య నిషేధంపై సూటి ప్రశ్న
  • బీజేపీతో ఉన్నానా? లేదా? కాదు.. మీకు న్యాయం చూడండన్న జనసేనాని
జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, తాను మాత్రం జగన్ భార్య గురించి ఏనాడూ మాట్లాడలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో ఆయన మాట్లాడుతూ... వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు. చాలాచోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, వాలంటీర్లు అందరూ అలాంటి వారు కాదని, కానీ ఈ వ్యవస్థలోనూ కొందరు కిరాతకులు ఉన్నారని ఆరోపించారు.

తాను ఏనాడూ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని, కానీ జగన్ మద్దతుదారులు తనను నీచంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా వాళ్ళు కూడా మహిళల జోలికి రారని, జనసేన మహిళలను మాత్రం వైసీపీ వారు తిడుతున్నారన్నారు. తాను రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంతో వచ్చానన్నారు. జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన సంస్కారహీనుడు అని మండిపడ్డారు. 'నువ్వొక సంస్కారహీనుడివి జగన్.. వెళ్లి ఒకసారి భారతి మేడం గారిని అడుగు ఏనాడైనా ఆవిడని మేము దూషించామా అని...' అని పవన్ నిలదీశారు. జగన్ మాదిరిగా తన తండ్రి ముఖ్యమంత్రి కాదన్నారు. 

వాలంటీర్లు తనకు సోదర సమానులని, వారి పొట్టకొట్టాలనేది తన ఉద్దేశం కాదన్నారు. వాలంటీర్లు అందరూ చెడ్డవారు అని తాను చెప్పడం లేదని, ఈ వ్యవస్థ ఎలా పని చేయాలో చెబుతున్నానని అన్నారు. వేతనం ఆశించకుండా పని చేసేవాళ్ళే వాలంటీర్లు, డబ్బులు తీసుకుంటే అలా ఎలా అంటారన్నారు. వాలంటీర్లు కేవలం రూ.5వేలకు పని చేస్తున్నారని, కానీ వారికి రెట్టింతలు ఇవ్వాలని కోరుకునే వాడినన్నారు. మీలాంటి యువత కోసమే నా పోరాటమని చెప్పారు. వాలంటీర్ల జీతం ఏపీలో మద్యం కంటే తక్కువ అని విమర్శించారు.

మద్యపాన నిషేధం చేస్తామని ఏపీలో అధికారంలోకి వచ్చి, రూ.1 లక్ష కోట్లకు పైగా మద్యం అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. సంపూర్ణ మద్యనిషేధం ఎక్కడా వీలుపడలేదన్నారు. ఏపీ డేటా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఉందని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకు రావాలని, జనసేన బాధితులకు అండగా ఉంటుందన్నారు. ఆడపడుచులు కోరుకునే మద్యనిషేధాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నారు.

ముస్లింలకు తాను వ్యక్తిగతంగా ఇష్టమని, కానీ తాను బీజేపీ వైపు ఉన్నానని నమ్మడం లేదన్నారు. కానీ జగన్ ముస్లింలకు షాదీ ముబారక్ తీసేశారని ఆరోపించారు. మీ మాతృభాషలో స్కూల్స్ పెట్టలేకపోయారన్నారు. నేను మాత్రం బీజేపీతో ఉన్నానా? లేదా? మీకు అనవసరమని, మీకు న్యాయం చేస్తానా? లేదా? అని చూడండన్నారు.
Janasena
Pawan Kalyan
YS Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News