Posani Krishna Murali: పవన్ కల్యాణ్.. ఎలాంటి వారికి మద్దతిస్తున్నావో తెలుస్తోందా?: పోసాని

  • వాలంటీర్లపై జనసేనాని వ్యాఖ్యలపై మండిపడ్డ పోసాని 
  • జగన్ రాజకీయ జీవితం నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని ఫైర్
  • ట్రాఫికింగ్ బాధితుల పేర్లు చెప్పాలంటూ డిమాండ్
Posani fires on Pawan Kalyan

‘మీ అన్నయ్య చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించారు.. చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏంటి మురళీ ఇది.. రాజకీయాల్లోకి వస్తే, వాళ్ల మాట వినకుంటే ఇంట్లో ఆడవాళ్లను తిట్టిస్తారా? నన్ను టార్గెట్ చేస్తే భరిస్తా.. ఆడవాళ్లు వాళ్లెలా భరిస్తారయ్యా అంటూ చిరంజీవి వాపోయారు. అప్పుడు నువ్వు స్పందించలేదు. అదేమని అడిగిన నన్ను, నా కుటుంబంలోని ఆడవాళ్లపై దాడి చేశారు. అప్పుడూ నువ్వు స్పందించలేదు. పవన్ కల్యాణ్ ఎటు పోతున్నావు..? ఎలాంటి వారికి మద్దతిస్తున్నావో నీకైనా తెలుస్తుందా?’ అంటూ పోసాని కృష్ణ మురళి జనసేనానిని నిలదీశారు.

వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం పోసాని ప్రెస్ మీట్ పెట్టారు. ట్రాఫికింగ్ వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, పదిమంది బాధితుల పేర్లు చెప్పాలని పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు. ట్రాఫికింగ్ అంటే పవన్ కు అర్థం తెలుసా? అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏం చెబితే, ఎలా చెబితే అలాగే స్పందిస్తాడంటూ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలపై ఓ మీడియాలో అసభ్యంగా వ్యాఖ్యానించినా పవన్ స్పందించలేదని గుర్తుచేశారు.

లోకేశ్ బాబు మా ఇంట్లో ఆడవాళ్లను తిట్టించారని బాధపడ్డావు, మా అమ్మ ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేశావు, మర్చిపోయావా? అంటూ పవన్ కల్యాణ్ ను పోసాని ప్రశ్నించారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు విని వాళ్ల తల్లులు ఏడవరా? అంటూ నిలదీశారు. ‘షేమ్ ఆన్ యూ పవన్..‘ అంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై తనకేమీ ద్వేషం లేదని, ఇంకా గౌరవమే ఉందని చెప్పారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ స్పందించింది తానేనని, కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ పవన్ అంటూ స్వాగతించానని పోసాని గుర్తుచేశారు.

ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం.. ప్రజలు ఆశీర్వదించినంత కాలం పవన్ కల్యాణ్ అయినా, జగన్ అయినా రాజకీయంగా ఎదుగుతూనే ఉంటారని చెప్పారు. జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనే ఆలోచన పవన్ నరనరాల్లో నిండిపోయిందని పోసాని విమర్శించారు. అయితే, జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం అదే ముఖ్యమంత్రి సీటులోనే ఉంటారని తేల్చిచెప్పారు.

More Telugu News