Shabbir Ali: ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టిందే మేం: షబ్బీర్ అలీ, సీతక్క

  • బీఆర్ఎస్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానన్న షబ్బీర్
  • కేసీఆర్, కేటీఆర్ నా సవాల్ కు సిద్ధమా? అని ప్రశ్న
  • 24 గంటల ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న సీతక్క
Shabbir Ali about Free power to farmers

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అన్నారు. తమ పార్టీ నినాదం గతంలో ఉచిత విద్యుత్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని తాను నిరూపిస్తానని, ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు.

రేవంత్ వ్యాఖ్యలపై సీతక్క

రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. అమెరికాలో ఒకరు అడిగిన ప్రశ్నకు రేవంత్ సమాధానం చెప్పారన్నారు. కానీ దీనిపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టింది తమ పార్టీయే అన్నారు. ఉచిత విద్యుత్ ను తాము మరింత మెరుగ్గా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ నిరసనలు వ్యక్తం చేయడం విడ్డూరమన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులకు లాభం చేయరు... మేం చేస్తామంటే చేయనీయరా? అని నిలదీశారు.

ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ వివరణ ఇస్తాడని సీతక్క చెప్పారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా? అని అధికార పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. మ్యానిఫెస్టోలో 3 గంటల విద్యుత్ అని రేవంత్ ఎక్కడా అనలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసమ్మతితో కొట్టుకుంటున్నారని విమర్శించారు. తాను పక్కనే ఉన్నందున ముఖ్యమంత్రి పదవిపై రేవంత్ అలా మాట్లాడవలసి వచ్చిందన్నారు. ఎవరినో తక్కువ చేయాలని.. మరెవరినో ఎక్కువ చేయాలని కాదన్నారు. ఎన్నికల తర్వాత సీఎంను అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భయంతో ఆయా పార్టీల నేతలు ఉన్నారన్నారు.

More Telugu News