Dharmapuri arvind: కేసీఆర్ కు ఇబ్బందిగా అనిపిస్తే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు: బీజేపీ ఎంపీ అర్వింద్

  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేశారన్న అర్వింద్ 
  • ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు వెళ్తుందని కేసీఆర్ భయపడ్డారని వ్యాఖ్య
  • సీతక్కను పీసీసీ చీఫ్ గా చేయాలన్న ధర్మపురి అర్వింద్
Dharmapuri Arvind targets KCR over UCC

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు ఒకసారి పార్లమెంటులో పాస్ అయ్యాక, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా అనిపిస్తే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. ఆయన అలా దేశం విడిచి వెళ్తే ఎవరూ వద్దని చెప్పరన్నారు. యూసీసీకి సంబంధించి మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఇతర ముస్లిం పెద్దలతో నిన్న కేసీఆర్ భేటీ అయ్యారని గుర్తు చేశారు.

కొన్ని ఛానల్స్ ఉద్దేశ్యపూర్వకంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని ప్రచారం చేశాయని, దీంతో ముస్లిం ఓట్లు అన్నీ కాంగ్రెస్ కు వెళ్తున్నట్లుగా కేసీఆర్ కు సమాచారం వచ్చిందని, దీంతో యూసీసీకి వ్యతిరేకమని చెబుతున్నారని విమర్శించారు. ముస్లిం ఓటు కాంగ్రెస్ కు వెళుతుందనే భయంతో వారితో భేటీ అయ్యారన్నారు. కొన్ని ఛానల్స్ ను కొనుగోలు చేసి బీఆర్ఎస్, బీజేపీ ఒకటని కేసీఆర్ ప్రచారం చేయించారని, ఇది ఆయనకే రివర్స్ అయిందన్నారు.

యూసీసీ ఉభయ సభల్లో భారీ మెజార్టీతో ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా దీనిని వ్యతిరేకించాలనుకుంటే కేసీఆర్ దేశం విడిచి వెళ్లవచ్చునన్నారు. ఉచిత కరెంటుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి సమాధానం చెప్పారన్నారు. బీజేపీ నుండి ఎవరూ బయటకు వెళ్లనప్పటికీ.. వారు వెళుతున్నారు.. వీరు వెళుతున్నారని పనిగట్టుకొని చూపించే ఛానల్స్, ఇప్పుడు దీనిని ఎలా చూపిస్తాయో చూస్తానన్నారు.

అవసరమైతే ఆదివాసీని సీఎం చేయాలన్న రేవంత్ వ్యాఖ్యలపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. అవసరమైతే అనే మాట ఎందుకు వచ్చిందని, నేరుగా సీఎంను చేస్తామని చెప్పవచ్చు కదా అన్నారు. అవసరమైతే అంటే రేవంత్ కు అవసరమైతేనా? అని ప్రశ్నించారు. అవసరమైతే.. అంటూ పనికి రాని రాజకీయాలు చేయవద్దన్నారు. మొదట సీతక్కను వెంటనే పీసీసీ చీఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఎమ్మెల్యేగా ఓడిపోతే, సీతక్క గెలిచిందన్నారు. ఆమె పాప్యులర్ లీడరని, కరోనా సమయంలో సేవ చేసిందని, రేవంత్ కనీసం బయటకు రాలేదన్నారు.

More Telugu News