Talasani: రేవంత్ రెడ్డితో అధిష్ఠానం క్షమాపణ చెప్పించాలి: మంత్రి తలసాని

  • రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులుండవన్న తలసాని 
  • పంట పెట్టుబడి, రైతుబీమాతో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉందన్న మంత్రి
  • రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందన్న సత్యవతి రాథోడ్
Talasani demand for Revanth Reddys apology

ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం క్షమాపణ చెప్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... రైతుతో గోక్కున్నవాడు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదన్నారు. సీతక్కను ముఖ్యమంత్రిగా చేయడం, రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలని చెప్పడం.. కాంగ్రెస్ పార్టీని ముంచేందుకేనని విమర్శించారు.

రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులుండవన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతు రాజును చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందన్నారు. పంట పెట్టుబడి, రైతుబీమా కార్యక్రమాలతో రైతులకు అండగా నిలిచిందన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ నిర్ణయమా? చెప్పాలన్నారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కూడా ఖండించాలన్నారు.

రైతాంగంపై కాంగ్రెస్ కక్షకట్టిందని, ఇందుకు రేవంత్ వ్యాఖ్యలే నిదర్శనమని సత్యవతి రాథోడ్ అన్నారు. ఉచిత విద్యుత్ రద్దు చేయాలన్న రేవంత్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని గతంలో చెప్పారని, ఇప్పుడు ఉచిత విద్యుత్ తీసేస్తామని చెబుతున్నారని సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News