KTR: రేవంత్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్

KTR fires at Congress for Revanth Reddy comments
  • ఉచిత విద్యుత్ రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ది అన్న మంత్రి
  • కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలు మరోసారి వెల్లడయ్యాయని విమర్శ
  • కాంగ్రెస్ ఆలోచనలను ప్రజలు, రైతులు వ్యతిరేకించాలని పిలుపు
ఉచిత విద్యుత్ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాకరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మంగళవారం స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని మండిపడ్డారు. గతంలోనూ రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎనిమిది గంటల విద్యుత్ మాత్రమే ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పడం ద్వారా ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు మరోసారి వెల్లడయ్యాయన్నారు.

కాంగ్రెస్ ఆలోచనలను తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలపై ఈ రోజు, రేపు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కులు, మనాలిలో విద్యార్థులు చిక్కుకున్నట్లు బాధితుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. వెంటనే ఢిల్లీలోని రెసిడెంట్ కమిషన్ ను అప్రమత్తం చేశామని, బాధిత విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. సహాయం కోసం టీఎస్ భవన్, కేటీఆర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
KTR
Congress
Revanth Reddy
Telangana

More Telugu News