Revanth Reddy: రేవంత్‌రెడ్డి చెప్పింది నడవదు ఇక్కడ.. నేను సీనియర్‌ను: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatareddy on Revanth Reddy comments
  • కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చెబుతున్నా... 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఎంపీ
  • ఉచిత విద్యుత్ ను మొదట తీసుకు వచ్చిందే కాంగ్రెస్ అని స్పష్టీకరణ
  • రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే తప్పు అన్న కోమటిరెడ్డి 
అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల్ని అధికార బీఆర్ఎస్సే కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, రేవంత్ మాటలు ఆయన వ్యక్తిగతమని, ఆయన చెప్తే ఫైనల్ కాదని అన్నారు. అయినా ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో కూడా చూడాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి జాతీయ సిద్ధాంతముందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా తాను చెబుతున్నానని 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్ ను మేనిఫెస్టోలో పెట్టి ఏడు గంటలు ఇచ్చిన పార్టీయే కాంగ్రెస్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాము తీసుకు వచ్చామని, అలాంటి దానిపై తాము ఎందుకు వెనక్కి వెళ్తామన్నారు. ఆయన టీవీ9తో ముఖాముఖిలో మాట్లాడారు.

రేపు తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఉచిత విద్యుత్ ను మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరం లేదని, 3 గంటలు సరిపోతుందని రేవంత్ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోందని, కానీ ఆయన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదన్నారు. ఆయన చెప్పినంత మాత్రాన జరగదని, ఇక్కడ నేను సీనియర్ ను అని, స్టార్ క్యాంపెయినర్ ను అన్నారు. రేవంత్ మాటలపై బీఆర్ఎస్ కూడా తొందరపడవద్దని సూచించారు. 

నేనే కాంగ్రెస్... కాంగ్రెస్సే రేవంత్ అనే మాట రేవంత్ అంటే కనుక అది తప్పు అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ అన్నారు. తాను, రేవంత్ వంటి నేతలం కేవలం కో-ఆర్డినేటర్లమని చెప్పారు. అయినా ఆ మాట రేవంత్ అన్నారా.. మీరు విన్నారా అని మీడియా ప్రతినిధిని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా అధిష్ఠానం నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య వంటి సీనియర్ నేతలు ఉన్నారన్నారు. ఉచిత విద్యుత్ అయినా.. ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా రేవంత్ చెబితే నడవదని, అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు.
Revanth Reddy
Komatireddy Venkat Reddy
Congress
Telangana Assembly Election

More Telugu News