Hyundai: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. ఎక్స్ షోరూం ధర రూ.6 లక్షలే !

Hyundai Has Introduced An Entry Level Suv Model In The Domestic Market
  • ఎక్స్ టర్ పేరుతో సరికొత్త ఎస్ యూవీని తీసుకొచ్చిన కంపెనీ
  • అందుబాటు ధరతో పాటు అదిరిపోయే మైలేజ్ ఇస్తుందని వెల్లడి
  • ఈ మోడల్ కోసం రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టామని కంపెనీ ఇండియా సీఎండీ వివరణ
ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్.. సరికొత్త ఎస్ యూవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ ‘ఎక్స్ టర్’ ను సోమవారం మార్కెట్ కు పరిచయం చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దిన ఈ కారుకు ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షలుగా నిర్ణయించింది. ఈమేరకు సోమవారం హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఉన్సూ కిమ్ మాట్లాడుతూ.. ఎక్స్ టర్ మోడల్ తో హ్యుందాయ్ ఇండియా కంపెనీ పూర్తిస్థాయి ఎస్ యూవీ విభాగంలోకి ప్రవేశించిందని తెలిపారు.

ఈ మోడల్‌ను తీర్చిదిద్దడానికి రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు వివరించారు. ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. తాజాగా విడుదల చేసిన కార్లలో 19.2 కిలోమీటర్ల మైలేజీ వచ్చే ఫైవ్ స్పీడ్‌ ఆటోమేటిక్‌ మోడల్ కారు ధరను రూ.7.96 లక్షలుగా నిర్ణయించామని ఉన్సూ కిమ్ చెప్పారు. ఇక, 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ మోడల్ ధర రూ.8.23 లక్షలుగా నిర్ణయించినట్లు వివరించారు. టాటా మోటర్స్‌కు చెందిన పంచ్‌కు పోటీగా 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన తాజా మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఉన్సూ కిమ్ వివరించారు.
Hyundai
car
EXTER
SUV
business
6 lakh car

More Telugu News